విశాఖ ఉక్కు వెలుగులు అదుర్స్.. అయినా అమ్మేస్తారంతే.!

Vizag Steel, Shows Its Strength Again

Vizag Steel, Shows Its Strength Again

నష్టాల్లో వున్న పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ సంస్థలనే కారణంతో పోషించలేం.. అది ఆర్థిక భారం.. ప్రభుత్వం వ్యాపారం చేయదు.. చేయలేదు..’ అంటూ అర్థం పర్థం లేని ఓ కట్టు కథని చెత్త చెత్తగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెనుక ఏ ‘లబ్ది’ ఎవరికి చేకూరనుందోగానీ, వేగంగా ప్రైవేటీకరణ చేసెయ్యాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమ, గత ఆర్థిక సంవత్సరం లెక్కల్ని ప్రకటించింది. 18 వేల కోట్ల టర్నోవర్ సాధించింది విశాఖ ఉక్కు పరిశ్రమ.. గత ఏడాదిలో. కరోనా కష్ట కాలంలోనూ ఈ స్థాయి ప్రగతి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 13 శాతం వృద్ధి నమోదయ్యిందని సాక్షాత్తూ విశాఖ ఉక్కు సీఎండీ పీకే రథ్ వెల్లడించారు. సో, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయడానికి నష్టాలు కారణం కాదన్నమాట.

ప్రైవేటు సంస్థలకు అప్పనంగా ముడి ఇనుము గనుల్ని కట్టబెడుతున్న పాలకులు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిశ్రమకు మాత్రం సొంత గనులు లేకుండా చేస్తున్నారు. ఎంతలా ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల్ని తొక్కేస్తున్నా, కార్మికుల కష్టంతో పరిశ్రమలు నిలదొక్కుకుంటున్నాయి. అయినాసరే, పాలకులకు అక్కసు చల్లారడంలేదు. 32 మంది ప్రాణ త్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు.. ముమ్మాటికీ ఆంధ్రుల హక్కు. లాభాల్లో వున్న పరిశ్రమ.. విలువైన భూములు వున్న పరిశ్రమ. అందుకే, పెద్ద గద్దల కళ్ళు పడ్డాయ్. ‘అయినా అమ్మేస్తాం..’ అని ఇకపై కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో చెప్పదలచుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. విశాఖ ఉక్కు పరిశ్రమ, దేశ సంపద. దేశ ప్రజలందరి సంపద. అమ్మేసే హక్కు ఏ పాలకులకీ వుండదుగాక వుండదు.