విశాఖ ఉక్కుపై పవన్ కళ్యాణ్ ‘కొత్త’ వాదన ఏంటి.?

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం విదితమే. రాజకీయ పార్టీలు ఎన్నిసార్లు ఎలా ప్లేట్లు ఫిరాయిస్తున్నా, ప్లాంటునే నమ్ముకున్న కార్మికులు మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వారికి ప్రజల నుంచీ మద్దతు లభిస్తోంది. అయినాగానీ, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసి తీరతామని కేంద్రం అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనల్నీ కేంద్రం పట్టించుకోవడంలేదు. అలాగని రాష్ట్రంలోని అధికార పార్టీ, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతోందా.? అంటే అదీ లేదు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంగతి సరే సరి. అసలు రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ తప్ప, స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎవరూ ఉద్యమించే పరిస్థితి లేదు. బీజేపీ మిత్రపక్షం జనసేనది చిత్ర విచిత్రమైన వాదన. ఏపీ బీజేపీ వాదన కూడా అంతే.

త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖ వెళ్ళనున్నారట.. స్టీలు ప్లాంటుని సందర్శిస్తారట.. స్టీలు ప్లాంటు కార్మిక సంఘాలతో సమావేశమవుతారట. అయితే, పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో ఏం మాట్లాడతారు.? కేంద్రాన్ని నిలదీస్తారా.? ఏమోగానీ, గతంలోనే స్టీలు ప్లాంటు విషయమై జనసేన తమ వైఖరిని స్పష్టం చేసిందనీ, ప్రైవేటీకరణ ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రులతో మాట్లాడారనీ, రాష్ట్ర ప్రజల సెంటిమెంటుని ఢిల్లీ గడ్డగా గట్టిగా వినిపించారనీ జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. నిజానికి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులెవరూ చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్న విమర్శ వుంది. ఇలాంటి కీలక అంశాల విషయంలో రాజకీయ పార్టీలు, నాయకులు. ఏకతాటిపైకి రావాల్సి వుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాల్ని పక్కన పెట్టాల్సి వుంది. కానీ, అది తెలంగాణలో సాధ్యమయ్యిందిగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యపడదు.