విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని కేంద్రం చెబుతోంది. కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ అంటే.. అది కేవలం ఓ సంస్థ మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం.. అన్న వాదన తెరపైకొచ్చింది. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు..’ అంటూ జరిగిన ఉద్యమం తాలూకు ఫలితం విశాఖ ఉక్కు పరిశ్రమ.
చాలామంది ఆత్మబలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యింది. ఈ క్రమంలో తెలుగు ప్రజలంతా ఎక్కటై తమ గొంతు వినిపించారు. తెలంగాణ ప్రజలకీ విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగం వుంది. అలాంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న ఆలోచన కేంద్రం ఎలా చేయగలుగుతోందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
దశం గడచిన ఏడేళ్ళలో కనీ వినీ ఎరుగని ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోందనీ, అందుకు ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశానికి కనీ వినీ ఎరుగని నష్టం జరిగింది. దానికి తోడు అనేక సమస్యలు దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి. తనదైన పబ్లిసిటీ స్టంట్లతో వాస్తవాన్ని ప్రజలకు తెలియకుండా మోడీ సర్కార్ జాగ్రత్తపడిందన్న విమర్శలున్నాయి.
ఆ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్నీ అమ్మేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో నవరత్న హోదా కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించేందుకు ముందుకు రావడం అత్యంత బాధాకరమైన విషయం. కానీ, దేశంలో మోడీ సర్కారుని నిలదీసేంత శక్తి విపక్షాలకు లేదు. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, కేంద్రాన్ని ఈ విషయమై ఎంత బతిమాలుకున్నా ప్రయోజనం కనిపించడంలేదు.
ఇక ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కార్మిక సంఘాలు ఎంత ఆందోళన చేసినా ఉపయోగమేముంటుంది.? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక ముందడుగు పడింది. వివాదాలు రాకుండా న్యాయ సలహాదారు నియామక ప్రక్రియ కేంద్రం చేపట్టింది. ఆస్తుల లెక్క కట్టడం, వివాదాలు లేకుండా చూడటం ఆ సలహాదారు బాధ్యత.