వైజాగ్ రాజకీయం.. వైఎస్సార్సీపీకి సమస్య కాబోతోందా.?

కర్నూలులో న్యాయ రాజధానిగా కార్యకలాపాలు ప్రారంభమైపోయినట్లుగా కొందరు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైసీపీ అనుకూల మీడియా కూడా అదే చెబుతోంది. హెచ్చార్సీ కార్యాలయం ఏర్పాటుతోనే దాన్ని న్యాయ రాజధాని అనేయగలమా.? ఛాన్సే లేదు. మరోపక్క, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అంటూ వైసీపీ చేస్తున్న హంగామా ఒకింత హద్దులు దాటేస్తున్నట్టే వుంది. ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. టీడీపీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు వైసీపీకి ఇదో అస్త్రం. అయితే, ఆ అస్త్రాన్ని సరిగ్గా వాడకపోతే, సెల్ఫ్ డిస్ట్రక్షన్ దానితోనే జరుగుతుందని వైసీపీ తెలుసుకోకపోతే ఎలాగన్నది ఉత్తరాంధ్రలో.. అందునా, విశాఖపట్నంలో స్థానికంగా వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోన్న అభిప్రాయం.

విశాఖపట్నంను ఎవరూ కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పనిలేదు. విశాఖను అందరూ తొక్కేయాలనుకున్నా, విశాఖ తన ఉనికిని చాటుకుంటోందన్న అభిప్రాయం విశాఖ వాసుల్లోనూ, ఉత్తరాంధ్ర వాసుల్లోనూ వుంది. వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించిందో, అప్పటినుంచీ విశాఖ వాసుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తూ వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం విశాఖకు రాజధాని హోదా దక్కకుండా చేసిందనే భావన అక్కడి ప్రజల్లో వుందన్నదీ నిర్వివాదాంశం. కానీ, రోజులు గడిచిపోతున్నాయ్.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవడంలేదు. ఎప్పడువుతుందో తెలియదు. ఈలోగా వైసీపీ, టీడీపీని టార్గెట్‌గా చేసుకుని రాజకీయ విమర్శలతో విరుచుకుపడుతున్న దరిమిలా, అది ప్రజల్లోకి నెగెటివ్ ఇంపాక్ట్ తీసుకెళుతోంది. 2024 ఎన్నికల్లోపు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకపోతే, రాజకీయంగా వైసీపీ పెద్ద దెబ్బ తినాల్సి వస్తుంది.. మొత్తంగా ఉత్తరాంధ్రలో.