విశాఖపట్టణంలో కలకలం లేపుతున్న దళిత యువకుడి శిరోముండనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏసీపీ త్రీనాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. అయితే.. ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను సీపీ మనీశ్ కుమార్ సిన్హా తాజాగా విడుదల చేయడంతో ఈకేసు మరో మలుపు తిరిగింది.
ఈ వీడియో ప్రకారం.. ఆ దళిత యువకుడికి గుండు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫుటేజ్ ను ప్రాథమిక సాక్ష్యంగా తీసుకొని విచారణ ప్రారంభించినట్టు సీపీ తెలిపారు. అయితే.. ఇందులో కొంతభాగం ఫుటేజ్ తొలగించి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించి నటుడు, నిర్మాత నూతన్ నాయకుడు, ఆయన భార్య మధుప్రియ, మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిపై 307, 342 తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
నూతన్ నాయుడు భార్య చెప్పడంతోనే ఆ యువకుడిని గుండు కొట్టించారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.
ఇక.. దళిత యువకుడికి గుండు కొట్టించడం ఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాయి.
విశాఖలోని పెందుర్తిలో ఉన్న నూతన్ నాయుడు ఇంట్లోనే ఆ యువకుడికి గుండు చేయించారు. ఇంతకీ.. ఆ యువకుడికి గుండు ఎందుకు చేయించారా? అని పోలీసులు ఆరాతీయగా.. ఆ యువకుడు.. నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే వ్యక్తి. పేరు శ్రీకాంత్. అయితే.. వాళ్లింట్లో చెప్పకుండా పని మానేశాడని.. తన భార్య సూచన మేరకు ఆ యువకుడికి గుండు చేయించారు.
అంతేకాదు.. తనను ఇంటికి పిలిచి.. ఫోన్ పోయిందని.. ఫోన్ దొంగలించావా? అంటూ దాడి చేసి తనకు గుండు కొట్టించారంటూ శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. ఆ యువకుడు వెంటనే పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులకు వీడియో ఫుటేజ్ లభించింది. ఆ ఫుటేజ్ ఆధారంగా నూతన్ నాయుడు, ఆయన భార్యతో సహా ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు. ఇక.. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.
కట్ చేస్తే.. ఇక్కడ నూతన్ నాయుడి గురించి మనం ఇంకాస్త మాట్లాడుకోవాలి. ఇప్పుడు నూతన్ నాయుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఒకవేళ నూతన్ నాయుడు అరెస్ట్ అయితే పెద్ద పెద్ద వాళ్లు బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. నూతన్ నాయుడు చాలామందికి బినామీగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈయన బినామీల లెక్క అంతా బయటికి వచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.