శ్రీభరత్.. ఎవరో మీకు గుర్తున్నాడా? పేరు ఎక్కడో విన్నట్టుందే అంటారా? మన బాలకృష్ణ చిన్న అల్లుడు. లోకేశ్ బాబు కో బ్రదర్. అప్పుడే మరిచిపోయారా? గత ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి శ్రీభరత్ టీడీపీ తరుపున పోటీ చేశాడు.. కానీ ఓడిపోయాడు. తక్కువ ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి చెందాడు. ఆయన గురించే మనం మాట్లాడుకునేది ఇప్పుడు.
ఆయన ప్రస్తుతం వైజాగ్ లో ఎక్కడా జల్లెడ పట్టినా కనిపించడం లేదట. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవ్వరికీ తెలియదట. అసలు.. పార్టీ కార్యక్రమాలనే పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పిలిచినా కూడా వెళ్లలేదట భరత్. ఎందుకని? ఒక టీడీపీ నాయకుడై ఉండి.. ఎందుకు పార్టీని పక్కన పెడుతున్నాడు.. అనే ప్రశ్న ప్రస్తుతం విశాఖ టీడీపీలో తలెత్తుతోంది.
ఆయన బంధం చాలా పెద్దదే. బాలయ్య బాబు అల్లుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వారసుడు, లోకేశ్ బాబు కో బ్రదర్.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది భరత్ పరిస్థితి. ఇంతమంది ఉన్నా కోరుకున్న సీటు దక్కలేదనే బాధలో శ్రీభరత్ ఉన్నాడట.
నిజానికి శ్రీభరత్.. భీమిలి నియోజకవర్గం టికెట్ అడిగాడు. అది కాదు కానీ.. వైజాగ్ నార్త్ ఇస్తామని చెప్పారట. ఆ తర్వాత విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారట. దీంతో శ్రీభరత్ కొంచెం అసహనానికి గురయ్యాడట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… వైజాగ్ జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు..కానీ శ్రీభరత్ మాత్రం ఎంపీగా ఓడిపోయాడు. దీని వెనుక ఖచ్చితంగా టీడీపీ నేతల హస్తం ఉందని ఆయనకు అనుమానం ఉందట. ఈనేపథ్యంలోనే పార్టీతో భరత్ దూరంగా ఉంటున్నాడు. అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు.