Virata Parvam Movie Review :‘విరాటపర్వం’ సినిమా ఎలా ఉందంటే…?
చిత్రం : విరాటపర్వం
రేటింగ్ : 3.5/5
రచన – దర్శకత్వం : వేణు ఊడుగుల
నటీనటులు: రానా, సాయిపల్లవి,నందితాదాస్, ప్రియమణి, నవీన్‌చంద్ర, జరీనావాహెబ్, సాయిచంద్, బెనర్జీ, రాహుల్ రామకృష్ణ, ఈశ్వరీరావు తదితరులు
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సమర్పణ : సురేష్‌బాబు
నిర్మాణ సంస్థలు : సురేష్ ప్రొడక్షన్స్ – శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
వెరైటీ కథలు.. విభిన్నమైన పాత్రలతో రొటీన్ కి బిన్నంగా సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు హీరో దగ్గుపాటి రానా. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటించిన సినిమా ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుపాటి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల కాలం లో సురేష్ బాబు నిర్మించిన వెంకటేష్ ‘నారప్ప’, ‘దృశ్యం పార్ట్ 2’ వంటి సినిమాలు ఓటిటిలోనే విడుదల అయ్యాయి. చాలా కాలం తర్వాత ఆయన నిర్మాణ సారథ్యం లో థియేటర్స్ లో విడుదల అవుతున్న సినిమా ఇదే. కావడం విశేషం.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. గత ఏడాది ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం గా వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాని ఓటిటిలోనే విడుదల చేసేందుకు సురేష్ బాబుకి భారీ మొత్తం లో ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా అద్భుతమైన రెవిన్యూ సాధించే సినిమా అని సురేష్ బాబు కి గట్టి నమ్మకం ఉండడం తో ఓటిటికి ఇవ్వకుండా థియేటర్స్ లోనే విడుదల చేయడానికి ఆసక్తిని చూపారు. నక్సల్స్ ఉద్యమం, నాటి సామాజిక, సాంఘిక పరిస్థితుల గురించి నేటి యువతకు పెద్దగా అవగాహన లేదు.
ఈ నేపథ్యంలో 90 దశకం నాటి నక్సలైట్ నేపథ్య కథతో దర్శకుడు వేణు ఊడుగుల విరాటపర్వం చిత్రానికి శ్రీకారం చుట్టడం అందరిలో ఆసక్తిని పెంచింది. యథార్థ సంఘటన ఆధారంగా ప్రేమ, విప్లవాన్ని కలబోసి రాసుకున్న మానవీయ కథాంశమిదని దర్శకుడు వేణు ఊడుగుల పలు సందర్భాల్లో సినిమా గురించి వెల్లడించారు. ప్రేమ అనే భూమిక మీద నడిచే విప్లవ నేపథ్య ఇతివృత్తం కావడం కూడా ‘విరాటపర్వం’పై అంచనాలు పెరగడానికి కారణమైంది. నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో ప్రేమకథను చూపించే దర్శకుడి ఈ సరికొత్త ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైంది? విడుదలకు ముందే పెరిగిన అంచనాల్ని వ్ సినిమా అందుకుందా?లాంటి విషయయాలన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కథ :
వరంగల్ జిల్లా ములుగు దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన పల్లెటూరి అమ్మాయి వెన్నెల (సాయిపల్లవి). ఆమె నాన్నఒగ్గు కథా కళాకారుడు కావడంతో చిన్నతనం నుంచే కవిత్వం , సాహిత్యంపై మక్కువ పెంచుకుంటుంది. నక్సలైట్ నాయకుడు రవన్న (రానా) అరణ్య పేరుతో రాస్తున్న రచనలు చదివి అతని ప్రేమలో పడుతుంది. ఎలాగైనా అతడిని కలుసుకోవాలనుకుంటుంది. ఓ రోజు అతడిని అన్వేషిస్తూ ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఆమె ప్రయాణం ఎలా సాగింది? నాటి సంక్షుభిత సామాజిక, రాజకీయ పరిస్థితుల నడుమ ఆమె ఎలాంటి కష్టనష్టాల్ని ఎదుర్కొంది? కృష్ణుడిపై మీరాబాయిలా అరణ్యపై అవ్యాజమైన అనురాగాన్ని పెంచుకున్న వెన్నెల పయనం చివరకు ఎక్కడికి చేరుకుంది? ప్రేమ, విప్లవం మధ్య తలెత్తిన నైతిక సంఘర్షణ అరణ్య, వెన్నెల కథను తీరానికి చేర్చిందా అన్నదే అసలుకథ.
విశ్లేషణ:
ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని ఎక్కడా నాటకీయతకు చోటులేకుండా ప్రతి సన్నివేశాన్ని సహజంగా, వాస్తవికతను ప్రతిబింబిస్తూ చిత్రీకరించారు. విప్లవం నేపథ్యంలో పవిత్రమైన ప్రేమను ఆవిష్కరించడంలో దర్శకుడు వేణు ఊడుగుల సఫలీకృతుడయ్యారు. 1990 దశకం నాటి తెలంగాణ పరిస్థితులకు దర్పణం పడుతూ ఆద్యంతం సినిమా సాగింది. తెలంగాణ జనజీవితాన్ని నక్సలైట్ ఉద్యమం ఎంతగానో ప్రభావితం చేసింది. 80, 90 దశకాల్లో ఎంతో మంది యువత నక్సల్స్ భావజాలానికి ఆకర్షితులై అడవి బాట పట్టారు. డాక్టర్లు, ఇంజనీర్స్ వంటి ఉన్నత విద్యావంతులు కూడా నాడు మూవ్‌మెంట్‌లో భాగస్వామ్యులయ్యేవారు.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ సమాంతర వ్యవస్థను నడిపిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో తెలంగాణ లో చోటు చేసుకున్న నక్సలైట్ ఉద్యమాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడు..ఈ చిత్రం లో రానా – సాయి పల్లవి ఇద్దరు కూడా నక్సలైట్స్ గా కనిపిస్తారు..వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ఎమోషన్స్ ని భావోద్వేగాలను డైరెక్టర్ వేణు ఉడుగుల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సాయి పల్లవి మరోసారి తన అద్భుతమైన నటన తో ప్రేక్షుకులను కంటతడి పెట్టించేలా చేసింది. ఈ సినిమాతో ముఖ్యంగా పతాక సన్నివేశంలో హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతారు. ఈ సన్నివేశంని వేణు ఉడుగుల ప్రేక్షకులకు పదికాలాల పాటు గుర్తుండిపోయ్యేలా తెరకెక్కించాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత పూర్తి స్థాయి కథానాయకుడిగా రానా నటించిన ఈ చిత్రం ఆయన కెరీర్ లో ఒక్క మైలు రాయిగా నిలిచిపోనుంది.
పోలీసుల కోవర్టుగా ముద్రవేయబడి..నక్సలైట్లచే హత్య చేయబడ్డ తూము సరళ అనే మహిళ యథార్థ గాథ ఆధారంగా దర్శకుడు ఈ కథ రాసుకున్నారు. నాడు ఆ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ వాస్తవ సంఘటనను తీసుకొని.. దానికి తనదైన తాత్విక, కవితాత్మక భావాల్ని మేళవించి ఈ కథను చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా నక్సలైట్ ఇతివృత్తాలు సామాజిక సమస్య ప్రధానంగానో.. పోరాటాల కేంద్రంగానే నడుస్తుంటాయి. కానీ ఈ సినిమాను నక్సలైట్ నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథగా తీర్చిదిద్దడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. కృష్ణుడిపై మీరాబాయి పెంచుకున్న ఆరాధనా భావంలాగా తన ప్రేమ కూడా స్వచ్ఛమైనదని వెన్నెల నమ్ముతుంటుంది. జీవితాంతం అరణ్యతో కలిసి ప్రయాణం చేయాలన్నది వెన్నెల లక్ష్యం.
ప్రేమ కోసం వెన్నెల సంఘర్షణ ప్రధానంగా కథను నడిపించాడు దర్శకుడు. ఈ క్రమంలో నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని కూడా అత్యంత సహజంగా చిత్రించాడు. ప్రథమార్థంలో అరణ్యను వెతుక్కుంటూ వెన్నెల చేసే ప్రయాణం భావోద్వేగాల్ని పంచుతుంది. జిల్లాలు మారుతూ అరణ్య కోసం అన్వేషించడం.. ఈ క్రమంలో వెన్నెల పోలీసుల నుంచి ఎదుర్కొనే వేధింపులు నాటి పరిస్థితులకు అద్దం పట్టాయి. అప్పటి రోజుల్లోని అణచివేత, పోలీసులు చేసే దుర్మార్గాల్ని కళ్లకుకట్టినట్లు చూపించారు. ప్రథమార్థమంతా చక చకా ఎలాంటి బోర్ కలిగించకుండా సాగిపోతుంది. ఇక ద్వితీయార్థంలో అరణ్య, వెన్నెల తాలూకు సంఘర్షణపై ఎక్కువగా దృష్టిపెట్టారు. విప్లవోద్యమంలో ప్రేమకు తావు లేదని అరణ్య ఎంత వారిస్తున్నా..తన జీవితప్రయాణం అరణ్యతోనే ముడిపడి ఉందని వెన్నెల నిర్ణయం తీసుకోవడం..ఈ క్రమంలో వారిద్దరి మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది. అప్పటి పోలీసుల బూటకపు ఎన్‌కౌంటర్లు, దళాల్లోకి కోవర్టులను పంపి వారిని తుదముట్టించే ప్రయత్నాలతో ద్వితీయార్థంలో కథను ఆసక్తిగా నడిపించారు. క్లైమాక్స్ ఘట్టాలు తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తాయి. మనసుకు హత్తుకుంటాయి.
ఎవరెలా చేశారు :
హీరో రానా దళనాయకుడు రవన్నగా చక్కటి నటనతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తన ప్రభావవంతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకర్షించాడు.
ఇక సాయిపల్లవి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుణ్హది. వెన్నెల పాత్రలో తనదైన సహజ అభినయంతో వాహ్..అన్పించింది. తెలంగాణ యాసలో అద్భుతంగా సంభాషణలు పలికించింది. దర్శకుడు వేణు ఊడుగుల, హీరో రానా సినిమా విడుదలకు ముందే చెప్పినట్లు వెన్నెల పాత్రకు సాయిపల్లవి తప్ప మరొకరు న్యాయం చేయలేరనిపించింది. ఇక రానా తల్లి పాత్రలో సీనియర్ నటి జరీనా వాహబ్ అద్భుతంగా నటించింది. టీచర్‌గా నందితాదాస్‌కు కథలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది.
కథానాయిక తల్లిదండ్రులుగా సాయిచంద్, ఈశ్వరీరావు తమదైన అభినయంతో మెప్పించారు. ప్రిమయణి, నవీనచంద్ర తమ పరిధుల మేరకు నటించారు. ఇక సాంకేతికంగా అన్ని విభాగాల్లో చక్కటి నాణ్యత కనిపించింది. సురేష్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచాయి. దర్శకుడు వేణు ఊడుగుల రాసిన సంభాషణలు బావున్నాయి. ఆ మాటలు హృదయాల్ని తాకి తూటాల్లా పేలాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లే ఉన్నతంగా ఉన్నాయి. మొత్తం మీద ప్రేమ-విప్లవం కలబోసిన ఈ ప్రణయగాథగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు!
-ఎం.డి అబ్దుల్..