ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎప్పుడూ ఏదో ఒక ఆరోపణ మోపుతూనే ఉంటుంది. వైఎస్సార్సీపీ మాత్రం ఊరికే ఉంటుందా? వాళ్లూ టీడీపీపై ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మొత్తానికి వాళ్లను వీళ్లు.. వీళ్లను వాళ్లు.. ఇలా తిట్టుకోవడమే తప్పితే ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడు మాత్రం కరువయ్యాడు.
టీడీపీ కూడా చాలా తెలివిగా వైఎస్సార్సీపీపై, ఏపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. అందుకే.. టీడీపీ టాప్ నాయకులంతా సీఎం జగన్ పై, వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ ప్రజల్లో వైసీపీపై, జగన్ పై వ్యతిరేకత తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ పచ్చి మోసకారి అంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్ విఫలమయ్యారు. సీఎం సీటు జగన్ జాగిరి అని అనుకుంటున్నారు. కానీ.. ఆ సీటు జగన్ కు పర్మినెంట్ కాదు. త్వరలోనే ఆ సీటును జగన్ ఖాళీ చేయాల్సిందే అంటూ నాని విమర్శలు గుప్పించారు.
22 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే.. ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రం కేంద్రంతో లాబీయింగ్ కు పాల్పడుతున్నారు. అంతే కానీ.. రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ జగన్ పట్టించుకోలేదు. హిట్లర్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. జగన్ ఎంత? జగన్ చరిత్ర అంతకంటే హీనం.. అంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు మీద నమ్మకంతో ఆనాడు రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే… ఇప్పుడు జగన్ మాత్రం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ.. రాజకీయ లబ్ధిని పొందుతున్నారంటూ… కేశినేని నాని ఎద్దేవా చేశారు.