భారతి పే.! మరీ ఇంతలా దిగజారిపోవాలా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతికి రాజకీయాలతో ఏం సంబంధం.? ఆమె ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాల్లో ఆమె ఏనాడూ పాల్గొన్నది లేదు. ముఖ్యమంత్రి సతీమణిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సతీమణిగా.. ఆమెకు వైసీపీలో గౌరవం దక్కుతుంటుంది.. ప్రభుత్వం పరంగా అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ దక్కుతుంటుంది.

కానీ, భారతీ రెడ్డిని రాజకీయాల్లోకి లాగి, ఆమెపై జుగుప్సాకరమైన రాజకీయ విమర్శలు చేసి, రాజకీయంగా పైశాచికానందం పొందాలన్న ప్రయత్నాలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా సాగుతున్నాయి.

‘భారతి పే’ అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పోస్టర్లు రూపొందించి, ముఖ్యమంత్రి సతీమణిపై దుష్ప్రచారానికి దిగారు. ఇటీవల కర్నాకటలో ముఖ్యమంత్రి అవినీతిని ప్రశ్నిస్తూ, ‘పే సీఎం’ అంటూ పోస్టర్లను వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అదే బాటలో, వైఎస్ భారతి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ‘భారతి పే’ అంటూ పోస్టర్లను రూపొందించారు.

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ మాఫియాతో వైసీపీకి ఏం సంబంధం.? సరే, వైసీపీ అధికారంలో వుంది గనుక, రాజకీయ విమర్శలు చేస్తే.. అందులో అర్థం వుంది. ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తే అదో లెక్క. కానీ, ముఖ్యమంత్రి సతీమణిని ఈ వివాదంలోకి లాగడం ఎంతవరకు సబబు.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిని ఎవరో ఏదో అన్నారని టీడీపీ నానా యాగీ చేసింది. వైఎస్ జగన్ సతీమణి మీద టీడీపీ చేస్తున్న ఆరోపణల మాటేమిటి.? దిగజారుడు రాజకీయాల్లో ఇది వేరే లెవల్. ఇంతకన్నా చెత్త రాజకీయాలు బహుశా ఇంకెక్కడా వుండవేమో.!