తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రగులుకుంటోంది. దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉపఎన్నిక రానుంది. అయితే.. ఈ ఉపఎన్నిక.. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్, బీజేపీకి చాలెంజ్ గా నిలిచింది.
ఇఫ్పటికే ఏ పార్టీ తరుపున ఎవరు నిలబడాలో కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. సీఎం కేసీఆర్ ఈ ఎన్నికలపై చాలా సీరియస్ గా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులకు ఈ ఎన్నికల గెలుపును అప్పగించారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలో మళ్లీ టీఆర్ఎస్ గెలవాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు.
అలాగే.. బీజేపీ కూడా ఈ ఉపఎన్నికను చాలెంజింగ్ తీసుకున్నది. ఇప్పటికే 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో మెరిసింది. ఎంపీ సీట్లను కూడా గెలుచుకున్నది. అదే ఊపుతో దుబ్బాక ఎమ్మెల్యే సీటును గెలిస్తే.. 2023 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడానికి ఇదే తొలి అడుగు అని బీజేపీ భావిస్తోంది. అందుకే.. బీజేపీ కూడా ఈ ఎన్నికలో గెలవడానికి సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికను కాస్త సీరియస్ గానే తీసుకున్నది. ఎందుకంటే.. ఇఫ్పటికే కాంగ్రెస్ ఖేల్ ఖతం అయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాథుడే లేడు. అటు జాతీయ స్థాయిలోనూ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. ఈనేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధిస్తే.. కాంగ్రెస్ లో మళ్లీ ఆశలు చిగురిస్తాయని.. అది వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
అందుకోసమే.. దుబ్బాక ఉపఎన్నిక కోసం ఏకంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని బరిలోకి దించుతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బలమైన నేత అయితేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. అందుకే.. విజయశాంతికే దుబ్బాక టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయింది.
కానీ.. దుబ్బాక ఉపఎన్నికపై విజయశాంతి పార్టీ హైకమాండ్ తో చర్చించారట. దుబ్బాకలో తాను పోటీ చేయనని పార్టీ హైకమాండ్ కు విజయశాంతి చెప్పినట్టు తెలుస్తోంది. దుబ్బాకలో టికెట్ స్థానిక నాయకుడు, ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహరెడ్డికి ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్ ను విజయశాంతి కోరారట.
అయితే.. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటనరసింహారెడ్డితో పాటుగా… కర్ణం శ్రీనివాస్, ఇంకో ఇద్దరు సీనియర్ నాయకులు.. దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టికెట్ తమకే వస్తుందని వేచి చూస్తున్నారు. అయితే.. విజయశాంతి ఈసారి దుబ్బాక బరిలో లేకపోతే తమలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని వాళ్లు భావిస్తున్నప్పటికీ.. విజయశాంతి సూచించినట్టుగా టికెట్ ను వెంకటనరసింహారెడ్డికి ఇస్తారా? అనే ప్రచారం జరుగుతోంది.