రాజుగారితో ఫైట్.. తగ్గేదే లేదంటున్న రెడ్డిగారు..

Vijayasai Reddy Vs Ashok Gajapathi Raju

Vijayasai Reddy Vs Ashok Gajapathi Raju

విషయం సుస్పష్టం. రాజకీయాల్లో రాజకీయ విమర్శలు మామూలే. ఆ విమర్శల చుట్టూ కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి ప్రస్తావనలన్నీ సర్వసాధారణమైపోయాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికీ, వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకీ ఓ పక్క పంచాయితీ నడుస్తోంది. ఇంకోపక్క, మరో రాజుగారితో విజయసాయిరెడ్డికి పంచాయితీ షురూ అయ్యింది.

ఈ రాజుగారు ఇంకెవరో కాదు, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు. మన్సాస్ ట్రస్టు వ్యవహారానికి సంబంధించి పెద్ద కుంభకోణం నడిచిందనీ, దానికి అశోక్ గజపతిరాజు కారకుడన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ. గత కొద్ది రోజులుగా మీడియా ముందుకొచ్చి విమర్శలు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు విజయసాయిరెడ్డి. రఘురామ విషయంలో వైసీపీని ప్రశ్నించని క్షత్రియ సమాజం, అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించాయి.. వైసీపీని నిలదీశాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ కూడా రాశాయి.

దాంతో, విషయం.. కులాల మధ్య వివాదంగా మారిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ నడుస్తోంది. అశోక్ గజపతిరాజు చుట్టూ ఎన్నో రాజకీయ వివాదాలు వుండొచ్చుగాక. కానీ, ఆయన విజయనగరం సంస్థానానికి వారసడు. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. బోల్డన్ని దాన ధర్మాలు చేశారాయన. అలాంటి వ్యక్తి లక్షల కోసమో, కోట్ల కోసమో కక్కుర్తి పడి అవినీతికి పాల్పడే అవకాశం వుంటుందా.? అన్న చిన్న లాజిక్, విజయసాయిరెడ్డి మిస్ అవుతున్నారు. ఇక్కడే వస్తోంది సమస్య అంతా.

అశోక్ గజపతిరాజు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మీద ఒక్క అవినీతి మరక కూడా పడలేదు. ఉత్తరాంధ్రలో వైసీపీ ఇమేజ్ పణంగా పెట్టి మరీ విజయసాయిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా.? అన్న సందేహాలు కొందరిలో కలుగుతున్నాయి. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు లేకుండా విజయసాయి అంత రిస్క్ తీసుకోగలరా.? ఏమో, క్షత్రియ సంఘాలు గుస్సా అవుతున్నా విజయసాయిరెడ్డి మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు.