వైసీపీ అధికారంలోకి వచ్చింది.. టీడీపీకి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ ఓ వెలుగు వెలిగింది. కానీ.. వైసీపీ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఒకటే రాజధాని అమరావతి అంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తే.. జగన్ వచ్చి.. మూడు రాజధానులు అన్నారు. దీంతో అది టీడీపీ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చింది. మరోవైపు వైసీీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా టీడీపీని ఇబ్బందులు పెట్టే పనిలో ఉన్నారు.
ఎందుకంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకే రాజధాని అంశాన్ని ప్రజల ముందుకు గట్టిగా తీసుకెళ్లలేకపోతున్నారు. త్వరలో వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో అస్సలు టీడీపీనే లేకుండా చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా విశాఖ కార్పొరేషన్ ను గెలవాలంటే.. టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి చేర్చుకోవడమో లేక… వాళ్లను వీక్ చేయడమో చేయాలి. దాని కోసం రంగంలోకి దిగారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. టీడీపీని దెబ్బ తీయడం కోసం తీవ్రంగా వ్యూహాలు పన్నుతున్నారు. ఆయన ముందు విశాఖ సౌత్ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. తర్వాత ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును టార్గెట్ చేశారు. సౌత్ ఎమ్మెల్యే ఎలాగూ వైసీపీ వైపే ఉన్నారు. కానీ.. విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే మాత్రం కాస్త మొండిగానే వ్యవహరిస్తున్నారు.
అక్కడ వెలగపూడికి బాగానే పాపులారిటీ ఉంది. పేరుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. దీంతో విజయసాయికి వెలగపూడి టార్గెట్ అయ్యారు. ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. భూకబ్జాలు అంటూ ఏదేదో వెలగపూడి మీద రుద్దడానికి విజయసాయి ట్రై చేసినప్పటికీ రివర్స్ లో వెలగపూడి విజయసాయి మీదనే ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా… విశాఖ కార్పొరేషన్ ను వైసీపీ కైవసం చేసుకోవాలంటే వైజాగ్ ఈస్ట్ లో టీడీపీని బలహీనపరచాలి. కానీ.. వెలగపూడి మాత్రం రివర్స్ లో విజయసాయి మీదనే ఆరోపణలు చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు.