తెలుగుదేశం పార్టీ మీదా, జనసేన పార్టీ మీదా, భారతీయ జనతా పార్టీ మీదా వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో రచ్చకి తెరలేపారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. టీడీపీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ ఎన్టీయార్ వెన్నుపోటుకు గురైన ప్రస్తావనను తెస్తూ, టీడీపీ అంతర్థాన దినోత్సవ శుభాకాంక్షలంటూ సంచలన ట్వీటేశారు విజయసాయిరెడ్డి. మరోపక్క, తిరుపతిలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు వస్తేనే గొప్ప.. అన్నట్టు ఇంకో ట్వీటేశారు. ఈ ట్వీట్లు వైసీపీ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకుపోయేవాళ్ళకి ఆనందాన్నిస్తాయేమోగానీ, వాటివల్ల అధికార వైసీపీకి లాభమేంటి.? పైగా, విజయసాయిరెడ్డి వేసే ట్వీట్లకు పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంటుంది. ఏ పార్టీకైనా ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా ప్రత్యేకమైనది. టీడీపీ అలా 40 ఏళ్ళ పండుగల సంబరాల్లో మునిగి తేలుతోంది.
టీడీపీ మీద ఈ సందర్భంలో ఇలాంటి విమర్శ హాస్యాస్పదం మాత్రమే కాదు, వైసీపీకి పెద్ద మైనస్ అవుతోంది. ఇక, బీజేపీ – జనసేన విషయంలో వైసీపీ ఇప్పటిదాకా ఆచి తూచి వ్యహరిస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపీ విషయంలో కొంత భయంతో కూడిన గౌరవాన్ని వైసీపీ ప్రదర్శిస్తున్న మాట వాస్తవం. కేంద్రంతో కయ్యం ఇష్టం లేకనో, ఇతరత్రా కారణాలు ఏమైనా వున్నాయోగానీ, ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళకు దండం పెట్టిన ఘన చరిత్ర వైసీపీ ముఖ్య నాయకత్వానికి వుంది. మరి, ఇంతలా బీజేపీని విమర్శించడం ద్వారా వైసీపీని విజయసాయిరెడ్డి కావాలనే కష్టాల్లోకి నెట్టేస్తున్నారా.? అన్న చర్చ జరగడమైతే సహజమే. తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకి అంత తేలిక వ్యవహారం కాదు. కష్టపడాల్సిందే.! ఇలాంటి తేలిక మాటలతో బీజేపీకి అతనపు అడ్వాంటేజ్ కల్పించినట్లవుతుందని వైసీపీ నాయకత్వం తెలుసుకోవాల్సి వుంది.