AP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై… జగన్ గురించి అలా మాట్లాడారెంటీ?

AP : ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైకాపా నాయకులు తమ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వైసిపి పార్టీకి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఊహించని విధంగా రాజీనామా చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది.

ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డి వైకాపాలో కీలక బాధ్యతలు తీసుకుంటూ పార్టీ వ్యవహారాలను చక్కబట్టేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఈయన జగన్ రాష్ట్రంలో లేని సమయంలో పార్టీకి రాజీనామా చేయటంతో ఒక్కసారిగా ఈయన రాజీనామా పై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత ఈయన మరోసారి ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారనే విషయం గురించి మాట్లాడుతూ పలు కారణాలను తెలిపారు. నిన్న రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయ్ సాయి రెడ్డి నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు.

నా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. నేను ముందు చెప్పినట్లుగా రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జగన్ లండన్ లో ఉన్నారు. అయితే ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడే అన్ని వివరాలు తెలియచేసి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

ఇక వైయస్సార్ కుటుంబంతో తనకున్నటువంటి అనుబంధం గురించి కూడా తెలియజేశారు. నాకు వైయస్ కుటుంబం 3 తరాలతో ఎంతో మంచి అనుబంధం ఉంది. నాకు ఈ జీవితంలో ఎప్పుడూ కూడా ఆ కుటుంబం నుంచి విభేదాలు రావని తెలిపారు. నేను బయటకు వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గదని విజయ్ సాయి రెడ్డి తెలిపారు.