తెలంగాణ ‘పోలీస్’పై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు.!

తెలంగాణ పోలీస్ విభాగానికి చెందిన ఓ అధికారిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీతో కుమ్మక్కయి, ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లింగ్.. అంటూ పోలీస్ సోదాల కోసం ప్రయత్నించారన్నది సదరు పోలీస్ అధికారిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణ తాలూకు సారాంశం.

తన వద్ద ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్న విజయసాయిరెడ్డి, ఆ ఆధారాలతో త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కలిసి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని ఉత్త ఆరోపణలు చేస్తే సరిపోదనీ, ఆధారాలు చూపించాలని విజయసాయిరెడ్డి అంటున్నారు.

గత కొంతకాలంగా రాజకీయ విమర్శల విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి అనూహ్యంగా మళ్ళీ దూకుడు పెంచారు. పైగా, రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న గంజాయి స్మగ్లింగ్ అంశంపై విజయసాయిరెడ్డి యాక్టివ్ అవడం, విపక్షాలకు ఘాటైన సమాధానమిస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

అయితే, తెలంగాణ పోలీస్ విభాగం గంజాయి స్మగ్లింగ్ విషయమై కొంత ఆందోళన చెందుతోంది. సరిహద్దుల్లో నిఘా పెంచింది తెలంగాణ పోలీస్ విభాగం. ముఖ్యమంత్రి కేసీయార్ కూడా, సరిహద్దుల్లోంచి గంజాయి అస్సలు రాకూడదనీ, తెలంగాణలో గంజాయి సాగుకి అవకాశమే ఇవ్వొద్దంటూ ఇటీవల ప్రత్యేక సమీక్ష సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో దొరుకుతోన్న గంజాయి తాలూకు లింకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లభ్యమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అవి ఆరోపణలు కావు నిజాలేనని ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులు చెబుతూ వస్తున్నారు. మరి, విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలిక.