దసరా ‘సినీ పండగ’.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?

సంక్రాంతి సినిమా.. విజయదశమి సినిమా.. ఆ పండగ కిక్కే వేరప్పా. కరోనా నేపథ్యంలో సంక్రాంతీ లేదు, విజయదశమీ లేదు.. వేసవీ లేదు. ఏడాదిన్నరగా ‘సినిమా పండగ’ సరిగ్గా కనిపించలేదు. థియేటర్లు మూత పడి కొన్నాళ్ళు.. తెరచుకున్నా, పలు ఆంక్షలతో మరికొన్నాళ్ళు సినిమా పరిశ్రమ విలవిల్లాడింది.. విలవిల్లాడుతూనే వుంది.

ఎలాగైతేనేం, కాస్త ఊరట. ఈ విజయదశమితో తెలుగు సినిమాకి పండగొచ్చింది. విడుదలైన సినిమాల ఫలితాల సంగతి పక్కన పెడితే, ప్రేక్షకులు ధైర్యంగా, సరదాగా సినిమా థియేటర్లకు వచ్చారు. ‘మహా సముద్రం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్ళి సందడి’ చిత్రాలు విజయదశమికి థియేటర్లలో సందడి చేశాయి.

థియేటర్ల వద్ద చాంతాడంత క్యూలైన్లు, బోల్డంతమంది జనం.. ఈ సందడి చూసి ఎన్నాళ్ళయ్యిందోనంటూ సినీ అభిమానులు, సినీ జనాలు మురిసిపోతున్నారు. సినిమాల ప్రమోషన్లతో బుల్లితెర కూడా కళకళ్ళాడిపోతుండడం మరో విశేషం.

విజయదశమి తర్వాత వచ్చే దీపావళి కోసం కూడా సినిమాలు సిద్ధంగానే వున్నాయి. విజయదశమితో పోల్చితే, ఈసారి దీపావళికి సందడి ఎక్కువ వుండే అవకాశముంది. ఆ తర్వాత చిన్న గ్యాప్ తర్వాత ఎటూ సంక్రాంతి సంబరాలు షురూ అవుతాయనుకోండి.. అది వేరే సంగతి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్లకు సంబంధించి ఫుల్ కెపాసిటీకి అక్కడి ప్రభుత్వం అనుమతివ్వడంతోనే ఈ కళ వచ్చిందన్న చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది. కాస్త ఆలస్యమైనా, పూర్తి సామర్థ్యంతో థియేటర్లకు అనుమతివ్వడంతో పరిశ్రమ పెద్దలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా వుంటే, కరోనా మూడో వేవ్ దేశంలో కనిపించే అవకాశాల్లేవని వైద్య నిపుణులు కుండబద్దలుగొట్టేస్తున్నారు. అందుక్కారణం.. రికార్డు వేగంతో అందరికీ వ్యాక్సిన్లు అందిస్తుండడమే. మిగతా వ్యవహారాల సంగతెలా వున్నా, కరోనా తగ్గుముఖం పట్టడం.. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు ధైర్యంగా వస్తుండడంతో పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఏడాదిన్నర నష్టాల నుంచి సినీ పరిశ్రమ ఎంత వేగంగా కోలుకుంటుందో వేచి చూడాల్సిందే.