ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడన్నది సినిమా డైలాగ్. మన్సాస్ ట్రస్టు వివాదానికి సంబంధించి కోర్టు ఇచ్చిన షాక్ కారణంగా, అధికార వైసీపీకి అనూహ్యమైన దెబ్బ తగిలినట్లే భావించాలి. ఎవరి అత్యుత్సాహం కారణంగా ఇలా జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే, ఉత్తరాంధ్రలో వైసీపీకి ఇది నిజంగానే పెద్ద షాక్.
ఎందుకంటే, వియనగర రాజుల వారసుడు అశోక్ గజపతిరాజు. ఆయన టీడీపీ నేత అయితే కావొచ్చు. కానీ, ‘రాజుగారు’ అన్న గౌరవం ఆయన మీద చాలామందికి వుంది. ఆ రాజుగారికి వారసత్వం పరంగా కొన్ని హక్కులు, అధికారాలు సంక్రమించాయి. వాటిని లాగేసుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేయడం పెద్ద తప్పిదమేనన్న చర్చ జనంలో జరుగుతోంది.
సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. కోర్టు తీర్పు తర్వాత, వైసీపీ మిన్నకుండిపోయి వుంటే బావుండేది. కానీ, అశోక్ గజపతిరాజు మీద ‘దొంగ’ అనే ముద్ర వేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కోట్లు దోచేశారంటూ ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. నిజానికి, అశోక్ గజపతిరాజు చేసిన సేవా కార్యక్రమాలతో పోల్చితే, తమ తాతలు తండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తులతో పోల్చితే.. వందల కోట్లు, వేల కోట్లనేవి పెద్ద విషయమే కాదు. ఇదే అభిప్రాయం జనంలో వుంది. దాంతో, అశోక్ గజపతిరాజు మీద అవినీతి ముద్ర వేయాలన్న విజయసాయిరెడ్డి వ్యూహం బెడిసికొట్టినట్లే చెప్పాలి.
మన్సాస్ అక్రమాల్ని వెలికి తీస్తామంటూ విజయసాయిరెడ్డి చెప్పడం కూడా హాస్యాస్పదంగానే వుంది. ఆ ట్రస్టు సంచయిత చేతికి వచ్చి ఏడాది కాలం అవుతోంది. ఆ సంచయితను నియమించిందే వైసీపీ ప్రభుత్వం. అలాంటప్పుడు, ఏడాది కాలంలో ఆ అక్రమాల్ని ఎందుకు బయటకు తీయలేదన్న చర్చ కూడా జరుగుతుంది కదా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు, విజయసాయిరెడ్డిపైనా కేసులున్నాయి.. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి, అత్యుత్సాహంతో.. అశోక్ గజపతిరాజు మీద విమర్శలు చేయడాన్ని వైసీపీలోనూ కొందరు సమర్థించలేకపోతున్నారట.