ఊహించని అతిథిగా వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికించింది. ఈ వైరస్‌కు భయపడి అన్ని దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. స్కూళ్ళు, బస్సులు, రైళ్ళు, ఫ్లైట్స్ , థియేటర్స్, షూటింగ్స్ ఇలా ఒకటేంటి అన్ని స్తంభించిపోయాయి. ఇక ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గుముఖం పడడంతో అన్ని పనులు ఊపందుకున్నాయి. ఎనిమిది నెలల పాటు ఆగిన సినిమా షూటింగ్స్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఫైటర్ అనే సినిమా కరోనాకు ముందు ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ముంబైలో షూటింగ్ ప్లాన్ చేసే సమయానికి కరోనా రావడంతో అర్ధాంతరంగా ఆపేశారు. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో అన్ని సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ, ఫైటర్ చిత్ర షూటింగ్ మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 20 నుండి షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట.
కరోనా వలన ప్రస్తుత షెడ్యూల్‌ని ఇండియాలోనే జరిపి ఆ తర్వాత విదేశాలకు వెళతారట. అక్కడ విదేశీ ఫైటర్స్ తో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ-ఛార్మి కలిసి తెలుగులో సినిమాను నిర్మిస్తుంటే.. హిందీలో కరణ్ జోహార్ నిర్మాతగా ఉంటున్నాడు.