ఆ తెలుగు సినిమాకి విద్యాబాలన్ ‘నో’ చెప్పేసిందా.?

బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ, సినిమా దారుణంగా ఫెయిలైంది. బయోపిక్ తీసి ఎన్టీఆర్ స్థాయిని తగ్గించేసిన బాలకృష్ణ.. అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. అది వేరే సంగతి.

విద్యాబాలన్ విషయానికి వస్తే, ఆమె కూడా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చాలా ఆవేదన చెందిందట. సినిమాపై చాలా అంచనాలతో ఉన్న విద్యాబాలన్, సినిమా విడుదలయ్యాకా, రిజల్ట్ చూసి షాక్ అయ్యిందట. దాంతో మళ్లీ తెలుగు సినిమాల్లో నటించడానికి తటపటాయించే పరిస్థితి వచ్చిందామెకి. ఇటీవల ఓ ప్రముఖ హీరో సినిమాలో కీలక పాత్ర కోసం విద్యా బాలన్ పేరు తెర పైకి వచ్చింది. ఆమెను సంప్రదిస్తే, నో చెప్పేసింది.

విద్యాబాలన్ ఎందుకిలా చేస్తోంది.? అన్న చర్చ తెలుగు సినీ పరిశ్రమలో నడుస్తోంది. అయితే, సక్సెస్, ఫెయిల్యూర్స్ అనే వాటిని ఆమె పెద్దగా పరిగణనలోకి తీసుకోదనీ, పాత్ర నచ్చితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటుందనీ అంటున్నారు. కాగా, తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ ఎప్పుడు.? అని విద్యాబాలన్‌ని ప్రశ్నిస్తే ‘అతి త్వరలో’ అని చెబుతూనే, ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమాకీ సైన్ చేయలేదని సమాధానమిచ్చింది ఈ బాలీవుడ్ సుందరి.