రోజుకో సిద్దాంతం, వారానికో పార్టీ.. ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకుల తీరు ఇదే. ఏ ఉద్దేశ్యంతో అయితే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారో చివరి శ్వాస వరకు ఆ ఉద్దేశ్యం కోసమే బ్రతికిన నాయకులు ఒకప్పుడంటే ఉండేవారు కానీ ఇప్పుడు మచ్చుకైనా కనబడరు. అలా అత్యున్నత ప్రజా జీవితం గడిపిన ఇద్దరు నాయకులు ఈరోజు కన్నుమూశారు. వారే ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు, సీపీం నేత సున్నం రాజయ్య. ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి ప్రజల సమస్యలనే పాటలుగా చేసుకుని గజ్జకట్టి గొంతెత్తిన వాగ్గేయకారుడు వంగపండు. శ్రీకాకుళం ఉద్యమంలో నిస్సత్తువ ఆవరించినప్పుడు ‘ఏం పిల్లో ఎల్దమొస్తవ.. ఏం పిల్లడో ఎల్దాం వస్తవ’ అంటూ ఉద్యమకారులకు కొత్త ఉత్తేజాన్నిచ్చారు వంగపండు.
గిరిజనులు, రైతులు, మహిళలు, వారి కష్టాలనే వస్తువులుగా చేసుకుని పాటలు రాసేవారు వంగపండు. స్వయంగా శ్రీశ్రీ లాంటి మహాకవి ‘నేను కవుల కవిని.. ఇదిగో ప్రజాకవి ప్రసాదరావు’ అంటూ వంగపండును ప్రజలకు పరిచయం చేశారంటే వంగపండు పాటల్లోని పదును, సాహిత్యంలోని గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 1972లో జననాట్య మండలిని స్థాపించిన ఆయన జీవితంలో ఏనాడూ స్వార్థంతో ఆలోచించింది లేదు. అందుకే పుట్టినప్పుడు ఎంతటి పేదరికంలో ఉన్నారో మరణించిన ఈరోజు వరకు అదే పేదరికంలో ఉండిపోయారు. ఇలాంటి నిబద్దత, క్రమశిక్షణ కలిగిన ప్రజల మనిషిని కోల్పోవడం నిజంగా బాధాకరం. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన లాంటి గొంతుక మళ్లీ పుడుతుందా అనేంతటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారాయన.
ఇక ప్రజల కోసమే సర్వస్వమూ అర్పించిన కమ్యూనిస్టు నేత సున్నం రాజయ్య కరోనాతో ప్రాణాలు విడిచారు. కమ్యూనిజం సిద్దాంతాన్ని భుజానికెత్తుకున్న నాటి నుండి కన్నుమూసే వరకు రాజయ్య ఆ సిద్దాంతాన్నే పాటిస్తూ గిరిజనుల అభివృద్ది కోసమే కష్టపడ్డారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయి పదవీకాలం ముగిసేలోపు కోట్లకు పడగలెత్తే రాజకీనాయకులు ఉన్న ఈరోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని భద్రాచలం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా తనకంటూ ఏమీ మిగుల్చుకోని నిస్వార్థ నాయకుడు రాజయ్య. చివరికి ఎమ్మెల్యేగా అందుకున్న జీతాన్ని సైతం సీపీఎం పార్టీ కోసమే వెచ్చించారంటే పార్టీ మీద ఆయనకున్న నమ్మకం, బాధ్యత ఎంత గొప్పవో అర్థమవుతుంది. ఇంతటి గొప్ప, ఉత్తమ లక్షణాలు కలిగిన ఈ ఇద్దరు ప్రజల మనుషులు ఒకేరోజు ప్రపంచాన్ని విడిచిపోవడం నిజంగా దుఖఃదాయకం.