ఏపీ ప్రభుత్వం ఉన్నపళంగా అర్థరాత్రి జీవో తీసుకొచ్చి ప్రేక్షకుల జేబులకు చిల్లులు పడకుండా చేస్తాం అంటూ టికెట్ ధరలను తగ్గించేసిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపాలిటీల్లో మినహా గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్ల టికెట్ ధరలు దారుణంగా పడిపోయాయి. లాక్ డౌన్ అనంతరం అనేక సినిమాలు వచ్చాయి. అన్నింటికీ టికెట్ హైక్స్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ముందురోజు రాత్రి నుండే టికెట్ ధరలను క్రమబద్దీకరిస్తూ ఆర్దర్లు పాస్ చేశారు. ఒక్కసారిగా కొన్నేళ్ల క్రితంనాటి ధరలకు వెళ్లిపోయారు.
దీంతో ‘వకీల్ సాబ్’ సినిమా హక్కుల్ని కొన్న బయ్యర్లు, థియేటర్ యజమానులు ఆందోళనలో పడ్డారు. ముందు ముందు సినిమాల్ని ఈ రేట్లతో రిలీజ్ చేయడం కష్టమని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఏదో నెట్టుకొచ్చిందని, చిన్న, మధ్య తరహా సినిమాలు అయితే ఇట్టే మునిగిపోతాయని అనుకుంటున్నారు. అందుకే సినిమాల్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే ‘టక్ జగదీష్’ చిత్రం వెనక్కు వెళ్ళింది. ఈ నెలలో సినిమాలన్నీ ఇలాగే పోస్ట్ ఫోన్ అవుతాయని అంటున్నారు. అదే గనుక జరిగితే థియేటర్లలో ‘వకీల్ సాబ్’ మాత్రమే ఉంటుంది. ప్రేక్షకులకు వేరే సినిమా చూసే అవకాశం ఉండదు. సో.. ఈ రకంగా నెల మొత్తం ‘వకీల్ సాబ్’ సినిమానే ప్రేక్షకులకు ఏకైక అప్షన్ అయ్యేలా ఉంది.