ఒక్కొక హీరోకు ఒక్కో వర్గంలో ఫాలోయింగ్ ఉంటుంది. చిరు, బాలయ్యలకు మాస్ జనాల్లో ఫాలోయింగ్ ఉంటే వెంకటేష్, నాగార్జునలకు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ఇలా హీరోలకు ఒక సొంత బలం అనేది ఏర్పడటం వారి కెరీర్ ఎదుగుదలకు చాలా సహకరిస్తుంది. మాస్ జనాల్లో ఇమేజ్ ఉన్న హీరో ఆ ఇమేజ్ ను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ అటు ఇటు అయితే పాతాళానికి పడిపోతుంది కెరియర్. అదే ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ను నిలబెట్టుకోవడం అనేది కొంచెం బెటర్. ఒకటి రెండు తప్పులు దొర్లినా ఇంకొక ఛాన్స్ ఇస్తారు వాళ్ళు.
అందుకే యూత్ ఆదరణతో పాటు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కూడ ఉండటం ఒక సేఫ్ గేమ్ లాంటిది. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు కాకుండా అప్పుడప్పుడూ వైవిధ్యం చూపడానికి కూడ ఇది ఉపకరిస్తుంది. అందుకే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈసారి ఫ్యామిలీ సెటిమెంట్ మీద సినిమా చేస్తున్నాడు. ‘ఉప్పెన’తో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వైష్ణవ్ తర్వాతి సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు. ఈ ప్రయత్నంలో అతను సఫలమైతే మాత్రం అతనికంటూ ఒక స్థిరమైన మార్కెట్, ఫ్యాన్ బేస్ ఏర్పడటం ఖాయం. మెగా కాంపౌండ్ నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి యువ హీరో కూడ మాస్ జనాలని టార్గెట్ చేశారు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం తెలివిగా ఆ పని చేస్తున్నాడు.