మనది జన భారతం.. ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో స్థానంలో వున్న దేశం. 140 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో కరోనా మహమ్మారి చేస్తున్న, చేయబోతున్న విలయతాండవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచానికే టీకా అందించే ఘనత మనదే.. అని ఘనంగా చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లు అందించలేక.. వందలాదిగా వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా నిశ్చేష్టులై చూస్తుండిపోతున్నాం. ఏదీ మన ప్రభుత్వ సమర్థత.? ఇదే ఇప్పుడు అందరి మెదళ్ళలోనూ మెదులుతున్న ప్రశ్న. చాలా రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. వ్యాక్సిన్ల కోసం జనం ఎగబడుతున్నారు.. కానీ, అక్కడ వ్యాక్సిన్లు సరిపడా లభ్యం కావడంలేదు. విదేశాల నుంచీ వ్యాక్సిన్లు దిగుమతి చేసుకుంటున్నాం పెద్ద సంఖ్యలో.. కానీ, అవి మన దేశ అవసరాల్ని తీర్చలేవు.
దేశంలో కరోనా వ్యాప్తి గత కొద్ది రోజులుగా కాస్త నెమ్మదించడం కొంచెం ఊరట. అయినాగానీ, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లను ప్రజలకు అందించాలి. కానీ, వ్యాక్సిన్లు ఏవీ.? ఎక్కడ.? వ్యాక్సిన్ కోసం పైరవీలు చేయాల్సి వస్తోంది. అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎంతైనా ఫర్లేదు.. ఖర్చు చేద్దాం.. అనుకుంటున్నా వ్యాక్సిన్ దొరకని పరిస్థితి. వ్యాక్సినేషన్ ఆలస్యమయ్యేకొద్దీ చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కరోనా మహమ్మారి కారణంగా. ఎలా.? ఈ సమస్యకు పరిష్కారం ఎలా.? లాక్ డౌన్.. అనేది కరోనా మహమ్మారి కొన్ని రోజుల పాటు నెమ్మదించడానికి ఉపయోగపడుతుంది తప్ప.. ఆ మహమ్మారికి చెక్ పెట్టలేదు. కొత్తగా మార్కెట్టులోకి స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కాస్త ఊరట. కానీ, దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఎందుకు రికార్డు స్థాయిలో తయారవడంలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కోవాగ్జిన్ గనుక విరివిగా తయారైతే, మిగతా వ్యాక్సిన్లపై దేశం ఆధారపడాల్సిన అవసరమే వుండదు.