ప్రస్తుతం ఎక్కడ చూసినా చలితో అంతా గజగజ వణుకుతున్నారు. కానీ.. హైదరాబాద్ లో మాత్రం రాజకీయ వేడి రాజుకుంది. వాతావరణం అక్కడ ఒక్కసారిగా వేడెక్కింది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా.. ఎన్నికల హడావుడే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తామంటే తాము గెలుస్తామంటూ ప్రధాన పార్టీలన్నీ గోల గోల చేస్తున్నాయి. ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
మేమేమన్నా తక్కువ తిన్నామా? అని కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ప్రచారం చేస్తోంది. మాంచి దూకుడు మీదుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
అధికార పార్టీతో పాటు బీజేపీని కూడా వదలట్లేదు కాంగ్రెస్ నాయకులు. రెచ్చిపోతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దూకుడు మీదున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈసందర్భంగా ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై ఉత్తమ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కి రాజకీయాలు తెలియదు. ఆయనకు రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన కరీంనగర్ లో కార్పొరేటర్ గా గెలిచి.. ఇక్కడికొచ్చి మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అసలు.. హైదరాబాద్ ఎక్కడుందో కూడా బండి సంజయ్ కి తెలియదు. అటువంటి వ్యక్తికి పార్టీ అధ్యక్షుడి పదవిని కట్టబెడితే ఇలాగే ఉంటది అంటూ ఉత్తమ్ ఫైర్ అయ్యారు.
అయితే.. బండి సంజయ్.. పాతబస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అది పెద్ద దుమారం లేపింది. బండి సంజయ్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.