ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గత కొన్నేళ్ల నుంచి తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవిని వదలట్లేదు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దగా గెలిచిందేమీ లేదు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో అందరికీ తెలుసు. అప్పట నుంచి తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఓడిపోతూనే ఉన్నది.
అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో.. నైతిక బాధ్యతగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్టుగా తెలుస్తోంది.
ఇవాళ వెలువడిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండంటే రెండు సీట్లు అంతే. అది కూడ ఉప్పల్, ఏఎస్ రావు నగర్ లో గెలిచింది. 150 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లలోనే గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రం అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే దుబ్బాకలోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మనుగడ కష్టమేనన్న భావన కలుగుతోంది. అయితే.. ఈనేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.