ఈమధ్య వార్తల్లో బాగా నానుతున్నారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. గుంటూరులో కీలకమైన తాడికొండ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమెకు మంచి ప్రాధాన్యం లభించింది. అయితే ఆ సంతోషం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. వైద్యురాలిగా ఉన్నప్పుడు మంచి పేరు తెచ్చుకున్న ఆమెకు రాజకీయాల్లో మాత్రం నిత్యం ఏదో ఒక వివాదం చుట్టుకుంటూనే ఉంది. సొంత పార్టీ నాయకులే ఆమెపై కుట్రలకు దిగుతున్నారు. పేకాట క్లబ్బులు, అప్పుకు డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడం, రెడ్డి నేతల మీద అసహనం వ్యక్తం చేయడం ఇలా పలు వివాదాల్లో ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం ఇరికించేశారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినా శ్రీదేవి అమాయకంగా ఆ ఉచ్చులో ఇరుక్కుపోయారు.
వరుసగా వాయిస్ రికార్డులు బయటికి రావడంతో జనం సైతం విస్మయానికి గురయ్యారు. మొదట్లో మహిళా ఎమ్మెల్యే వైఖరి ఇంత తేడాగా ఉందేమిటని అసంతృప్తి చెందిన ఆ జనమే ఇప్పుడు ఆమెపై అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తున్నారు. మొదటి నుండి ఎంపీ నందిగాం సురేష్ కు శ్రీదేవికి విబేధాలు ఉన్నాయి. వాటి మూలంగా ఆమె చాలానే ఇబ్బందులు పడ్డారు. చివరికి సయోధ్యకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మరొక వైసీపీ నేత కూడ ఆమెకు వ్యతిరేకంగా మనుషుల్ని ప్రయోగించడం కలకలం సృష్టిస్తోంది. టీడీపీ నుండి వైసిపీలోకి వచ్చి ఎమ్మేలిసి అయినా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేశారని చెప్పుకుంటున్నారు.
తాడికొండ నుండి రెండుసార్లు ఎమ్మెల్యే అయిన డొక్కా గత ఎన్నికల్లో టికెట్ పొందాలని చూసినా చంద్రబాబు కనికరించలేదు. దీంతో ఆయన వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఈసారి ఎలాగైనా తాడికొండ టికెట్టును తన కుమార్తెకు ఇప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని అధిష్టానం ముందు ప్రజల్లో బ్యాడ్ చేయాలని కుట్రలు పన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఆయన ప్లాన్ రివర్స్ అయింది. శ్రీదేవి మీద వ్యతిరేకత కంటే సానుభూతి ఎక్కువగా పుడుతోంది. మంచి డాక్టర్ అనే పేరు తెచ్చుకున్న శ్రీదేవిని ఈ రాజకీయ నాయకులంతా కలిసి వేధిస్తున్నారని, తొక్కేసేందుకు కుట్రలు చేస్తున్నారనే అభిప్రాయం జనంలో మొదలైంది.
ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కోసాగితే, ఇలాగే ఆమెను టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడితే మాత్రం సానుభూతి బాగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కూడా ఆమే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. వైసీపీ నుండే కాదు వేరే ఏ పార్టీ తరపున నిలబడినా, అధికార వైసీపీ ఆమెకు వ్యతిరేకంగా ఎంత పెద్ద అభ్యర్థిని పోటీకి దింపినా గెలిచే శక్తి సామర్థ్యాలను ఆమె సంపాదించుకోవడం ఖాయం.