ఉండవల్లి శ్రీదేవి కి లాస్ట్ మినిట్ అప్పయింట్మెంట్ ఇచ్చిన జగన్ ?

వైసీపీలో చాలా తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్లలో ఉండవల్లి శ్రీదేవి ఒకరు. ఆమె ఎంత స్పీడ్ గా ఎదుగుతున్నారో అంతే త్వరగా ఆమె చుట్టూ వివాదాలు చుట్టూ ముట్టుతున్నాయి. తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి సొంత పార్టీ నేతల నుండే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వైసీపీలో ఉన్న చాలామంది నేతలతో తన సొంత నియోజక వర్గంలోనే శ్రీదేవి గొడవలకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి పెట్టిన కేసు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆ కేసుకు కూడా వైసీపీ నేతలపైనే పెట్టడం వివాదాస్పదంగా మారింది.

శ్రీదేవికి ప్రాణహాని ఉందా!!

తనకు ప్రాణహాని ఉందంటూ గుంటూరులోని నరగపాలెం పోలీస్ స్టేషన్ లో శ్రీదేవి ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తాడికొండకు చెందినశృంగపాటి సందీప్, చలివేంద్ర సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదులో శ్రీదేవి పేర్కొన్నారు. గతంలో వీళ్లిద్దరూ చట్ట వ్యతిరేకమైన పనులు చెయ్యడం వల్ల, పేకాట క్లబ్ లు నిర్వహించే వాళ్ళని, అందుకే పార్టీ నాయకులు వీళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేశారని, అయితే తాను చెప్పడం వల్లే పార్టీ పెద్దలు వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేశారని వాళ్ళు భవిస్తూ తనపై కక్ష్య కట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సందీప్, సురేష్ గతంలో ఇద్దరు శ్రీదేవి దగ్గరే పనిచేశారని, వాళ్ళు నిర్వహించిన పేకాట క్లబ్ శ్రీదేవికి కూడా సంబంధం ఉందని గతంలో వార్తలు కూడా వచ్చాయి.

అప్పాయింట్మెంట్ ఇచ్చిన జగన్

ఉండవల్లి శ్రీదేవికి ప్రతిపక్షాల నుండి కంటే కూడా సొంత పార్టీ నేతల వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు ఆమె ఈ సమస్యల గురించి పార్టీ అధిష్టానానికి తెలియజేసినప్పటికి సొంత పార్టీ నేతల నుండి ఇబ్బందులు తప్పకపోవడంతో ఇప్పుడు నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తన బాధను చెప్పుకోవడానికి సిద్ధమైంది. జగన్ కు తనకు ఉన్న సమస్యల గురించి, అలాగే తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి, సందీప్, సురేష్ ల నుండి ఉన్న ప్రాణహాని గురించి కూడా చర్చించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిత్యం వివాదాల్లో ఉండే శ్రీదేవిని జగన్ ఎలా కాపాడుతారో వేచి చూడాలి.