మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయాలపై స్పందించారు. న్యాయవ్యవస్థపై జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. జస్టిస్ రమణపై వస్తున్న ఆరోపణలను తాను వ్యక్తిగతంగా నమ్మనని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకముందు లక్షల కోట్లు దోచుకున్నారని ప్రచారం సాగింది. ఇప్పుడు ముఖ్యమంత్రే నిందితుడిగా విచారణ జరగబోతున్నది. అయితే.. రాజకీయ నాయకులపై కోర్టుల్లో విచారణ జరిగినప్పుడు మాత్రం ప్రజలకు లైవ్ విచారణ చూపించాలి. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలు చూడాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఉండవల్లి అన్నారు.
ఆ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే.. చంద్రబాబు కావచ్చు.. జగన్ కావచ్చు… ఎవరి కేసుల విషయంలోనైనా లైవ్ టెలికాస్ట్ చేయాలన్నారు.
ముఖ్యమంత్రులు లేఖలు రాయడం ఇదే కొత్తేమీ కాదు
అయితే.. ముఖ్యమంత్రులు కోర్టులపై, జస్టిస్ లపై ఆరోపణలు చేస్తూ లేఖలు రాయడం ఇదే కొత్తేమీ కాదని ఉండవల్లి స్పష్టం చేశారు. గతంలో సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టులపై లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే.. లేఖ రాయడం పక్కన పెడితే… జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జస్టిస్ రమణపై ఆరోపణలు చేయడం తప్పా? ఒప్పా? అనే విషయం మీద ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. జగన్.. చాలా మొండిగా ముందుకు వెళ్తున్నారు. అయితే.. చట్టం ముందు జడ్జిలు కూడా అతీతులు కాదు.. అంటూ ఉండవల్లి చెప్పుకొచ్చారు.