దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే బాటలో మరికొందరు హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు.
ఇంకోవైపు తమిళనాట విజయకాంత్.. ఎండీఎంకే పార్టీని స్థాపించి ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగారు. అదే బాటలో కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. తాజాగా తమిళనాట కరుణానిధి మనవడు, స్టాలిన్ కుమారుడు.. తమిళనాట ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్, త్వరలో జరగనున్న తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లోచెన్నెలోని ’చెపాక్’ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన పోటీ చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే.. ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి అవుతుంది. మరోవైపు డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమవుతోంది స్టాలిన్ వెల్లడించారు. దీనికోసమే ప్రత్యేకంగా మార్చి 7న తిరుచిరాపల్లిలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో డీఎంకే పదేళ్ల విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు తమిళ ఎన్నికల్లో ఖుష్బూ, గౌతమి వంటి వాళ్లు బీజేపీ తరుపున అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. అంతేకాదు మరికొంత మంది సినీ నటులు వేర్వేరు పార్టీల నుంచి అసెంబ్లీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.