తమిళ నటుడిగా శతాధిక చిత్రాల్లో మెరిసిన కమల్ హాసన్, ఇప్పుడు పార్లమెంటు సీమల్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు, ఎట్టకేలకు రాజ్యసభ ద్వారానే పార్లమెంటు సభ్యత్వం దక్కేలా కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతు తెలిపిన కమల్‌కు, ప్రతిఫలంగా ఒక రాజ్యసభ సీటు ఇచ్చే వాగ్దానం డీఎంకే చేసిందని సమాచారం. ఇప్పుడు అదే అమలు దశలోకి వచ్చింది.
డీఎంకే బుధవారం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో, కమల్ హాసన్‌తో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభకు నామినేట్ చేసింది. వీరిలో ఉన్నవారు – ప్రస్తుత సభ్యుడు వి.విల్సన్, రచయిత సల్మా, ఎస్.ఆర్. శివలింగం. ఈ నలుగురికీ తాము మద్దతుగా నిలుస్తామని డీఎంకే స్పష్టంచేయడంతో, కమల్ ఎంపికపై ఇక అనుమానాలు లేవు. తమిళనాడు శాసనసభలో డీఎంకేకు మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు ఖాయమైంది.
కమల్ హాసన్ రాజకీయ ప్రయాణం 2018లో ఎంఎన్‌ఎం పార్టీ స్థాపనతో ప్రారంభమైంది. అప్పటి నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా, విజయాలు దక్కలేదు. అయినా, 2019 లోక్‌సభలో ఆయన పార్టీకి 3.72 శాతం ఓట్లవాటా దక్కటం గమనార్హం. ప్రజా సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలు, బలమైన వాఖ్యాలుతో కమల్ తనదైన గుర్తింపు సాధించారు. కానీ ఎన్నికల్లో ఫలితాలుగా అవి తారసపడలేదు.
రాజ్యసభ దారిలో అడుగుపెడుతున్న కమల్ హాసన్, ఇకపై పార్లమెంటులో తన స్వరం వినిపించనున్నారు. దేశ రాజకీయాలపై ఆయన దృష్టి ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. ఒక పక్క రాజకీయాల్లో స్థిరపడాలన్న ఆశ, మరో పక్క సినీ కాంతులు.. ఈ రెండు ప్రపంచాల్లో సమతుల్యం ఎలా చేస్తారన్నదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్.