తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీపి కబురు. తమ ప్రభుత్వం కోరుకున్న విధంగానే కేంద్రం, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల పరిధిని ఆయా నదుల బోర్డుల ద్వారా నోటిఫై చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఓ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అసలు ఆయా బోర్డుల పరిధితో తమకు సంబంధం లేదన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం వ్యవహరించడమే కాదు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా జల విద్యుత్ చేపట్టి, మూడు ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి వదిలేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది నీటి వాటా విషయంలో. ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లతో తెలంగాణకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది.
ఈ విజయాన్ని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మరోపక్క, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. రఘురామకు నోటీసులు జారీ చేసింది. ఏ క్షణాన అయినా రఘురామకు నోటీసులు జారీ అయ్యే అవకాశం వుందని గత కొద్ది రోజులుగా వైసీపీ చెబుతున్న విషయం విదితమే.
రఘురామ మాత్రం తనపై అనర్హత వేటు అసాధ్యమని చెబుతూ వచ్చారు. నోటీసులు అందుకున్నాక, ఆయన పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి వుంటుంది. వివరణ తర్వాత రఘురామపై అనర్హత వేటు పడుతుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. నోటీసులు అందుకోవడంతోనే రఘురామ ఆత్మవిశ్వాసం కొంతమేర దెబ్బతింటుందన్నది వైసీపీ శ్రేణుల వాదన.
నోటీసులకు ఆయన ఇచ్చే వివరణ పేలవంగా వుండబోతోందనీ, ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతుందనీ, పార్టీ ధిక్కరణకు పాల్పడ్డారనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు రఘురామకు వ్యతిరేకంగా వున్నాయని వైసీపీ చెబుతోంది.