తెలంగాణలోనూ స్కూళ్ళు తెరచుకోనున్నాయ్.. థర్డ్ వేవ్ భయాల్లేనట్టేనా.?

ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చిన విషయం విదితమే. ఓ స్కూల్‌లో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఈరోజే మీడియాలో వార్తలొచ్చాయి. ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థల్ని తెరుస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు తెరచుకుంటాయి. అన్ని తరగతుల విద్యార్థులకూ ప్రత్యక్ష బోధన వుంటుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని, ఆల్ ఈజ్ వెల్.. అనుకున్నాకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘సెకెండ్ వేవ్ తెలంగాణలో ముగిసింది..’ అని ఇటీవల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం విదితమే. అయితే, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నప్పటికీ, సున్నాకి మాత్రం పడిపోలేదు.

ప్రస్తుతం 300 నుంచి 500 లోపు కరోనా పాజిటివ్ కేసులు రోజువారీగా నమోదవుతున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి వచ్చేసింది. అయితే, సీజనల్ జ్వరాల కారణంగా ఏ చిన్న అనారోగ్యం బారిన పడినా అది కోవిడ్.. అనే అనుమానాలైతే ప్రజల్లో వున్నాయి. ఇదిలా వుంటే, అక్టోబర్‌లో థర్డ్ వేవ్ పీక్ వుంటుందంటూ కేంద్రానికి తాజాగా ఓ నివేదిక అందడం, ఇంతలోనే విద్యా సంస్థల్ని తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా అనుమానాలు కలుగుతున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులకి. మూడో వేవ్ ప్రధానంగా చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తుందనే అభిప్రాయాలు వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతున్న విషయం విదితమే. మరి విద్యా సంస్థలు తెరిస్తే, తద్వారా జరిగే నష్టానికి బాధ్యత వహించేదెవరు.? ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. ఎన్నాళ్ళు విద్యార్థుల్ని చదువులకు దూరంగా వుంచగలుగుతాం.? అలా చేయడం ద్వారా వారి భవిష్యత్తుని నాశనం చేసినట్లే అవుతుంది మరి.