వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు పలువురు వైసీపీ నేతలు. కొద్ది రోజుల క్రితం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల, నిరాటంకంగా తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆమెపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు జుగుప్సాకరమైన విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల మంత్రి ఒకరు షర్మిలని ‘మంగళవారం మరదలు’ అని సంబోదించడం వివాదాస్పదమయ్యింది. ఆ వ్యాఖ్యలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ‘చందమామని చూసి కుక్కలు మొరుగుతాయ్..’ అని కౌంటర్ ఎటాక్ షురూ చేశారు. దాంతో, సదరు మంత్రి ‘క్షమాపణ’ చెప్పాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విమర్శించిన దరిమిలా, ఏకంగా టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ నేతలైతే, కొద్ది రోజుల పాటు బూతుల ప్రవాహంలో సేదతీరారు.. జనాగ్రహ దీక్షల పేరుతో.
మరి, షర్మిలపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ఎందుకు స్పందించలేదట.? వైసీపీ కోసం షర్మిల గతంలో పాదయాత్రలు చేసిన విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోయారా.? షర్మిల ప్రచారం కలిసొచ్చి గెలిచిన నేతలెందుకు ఇప్పుడామె తరఫున వకాల్తా పుచ్చుకోవడంలేదు.? ఇదే చర్చ ఇప్పుడు వైఎస్సార్టీపీలో జరుగుతోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాదని షర్మిలకి మద్దతిచ్చే పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుండదు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు బీపీ రావాలన్నా అది జగన్ అనుమతితోనే జరగాలి. అదీ సంగతి.