దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు జరిగింది.? సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణం కారణంగా. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎందుకు జరుగుతోంది.? ఇక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతోనే. కానీ, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని ఓ డివిజన్ విషయంలో మాత్రం బీజేపీ – టీఆర్ఎస్ ఓ అవగాహనకు వచ్చాయి. బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్, గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినా, ప్రమాణ స్వీకారం చేయకుండానే హఠాన్మరణం చెందారు. ఆయన కుమారుడే పోటీ చేస్తున్నందున, ఉప ఎన్నికలో పోటీ చేయవద్దంటూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని బీజేపీ కోరింది.. గులాబీ పార్టీ అందుకు అంగీకారం కూడా తెలిపింది. ఇక, దుబ్బాక.. అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల విషయానికొస్తే, అక్కడి పరిస్థితులు వేరు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హఠాన్మరణం చెందినప్పుడు, వారి కుటుంబ సభ్యులే ఉప ఎన్నికల్లో పోటీ చేసినా, అప్పట్లో టీఆర్ఎస్ నీఛ రాజకీయాలు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలోనే, దుబ్బాక అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలు గట్టిగా నిలబడ్డాయి.
రాజకీయాల్లో విలువలు, వంకాయలనేవి ఎప్పుడో మాయమైపోయాయి. గ్రేటర్ పరిధిలోకి వచ్చేసరికి ఇటు గులాబీ పార్టీకీ, అటు కమలం పార్టీకీ విలువలు గుర్తుకొచ్చేయడం ఆశ్చర్యకరమే. ఏ ఉద్దేశ్యంతో బీజేపీ – టీఆర్ఎస్ ఒక్కటైనప్పటికీ, సిట్టింగ్ కార్పొరేటర్ కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి పట్ల సానుభూతి ప్రకటించడాన్ని ఆహ్వానించాల్సందే. మనిషి బతికున్నాక గౌరవం ఇచ్చినా, ఇవ్వకున్నా.. చనిపోయాక ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని రాజకీయ పార్టీలూ ఇది నైతిక బాధ్యతగా తీసుకోవాలి. అన్నట్టు, తిరుపతి ఉప ఎన్నిక కూడా సిట్టింగ్ అభ్యర్థి అకాల మరణం నేపథ్యంలో జరుగుతున్నదే. అయితే, తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులు అకాల మరణం చెందినప్పుడు, ఆయా పార్టీలు బాధ్యత తీసుకుని, ఇతర పార్టీలను ఒప్పిస్తే, రాజకీయాల్లో నైతికత అనేదానికి కాస్తయినా విలువ పెరుగుతుంది.