భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో టీఆర్ఎస్ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందా.? జరుగుతున్న పరిణామాల్ని ఎలా చూడాలి.? బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం దగ్గర్నుంచి, తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనాగానీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోయి.. పోటీ మాత్రం బీజేపీ – టీఆర్ఎస్ మధ్యనే అన్నట్లు తయారైంది పరిస్థితి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా బీజేపీకి తెలంగాణలో కొంత మైలేజ్ బాగానే పెరుగుతోంది. తాజాగా, ఈ యాత్రకు బ్రేకులు వేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు, తనదైన రీతిలో వ్యూహాలు సిద్ధం చేసి, అమలు చేస్తోంది.
బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ, శాంతి భద్రతలకు విఘాతం పేరుతో వరంగల్ పోలీసులు.. ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేకులేశారు. విషయం గవర్నర్ దగ్గరకు వెళ్ళింది. బీజేపీ న్యాయ పోరాటం కూడా షురూ చేసింది. దేశంలో చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేశారు. ఎక్కడా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదనే చెప్పాలేమో.!
శాంతి భద్రతలకు విఘాతం కలిగితే, ఆ పరిస్థితుల్ని నిలువరించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానిది. ఆంతే తప్ప, ఏమో.. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందేమో.. అంటూ రాజకీయ నాయకుల్ని జనంలో తిరిగొద్దంటే ఎలా.? ఇక్కడ విషయం సుస్పష్టం. బీజేపీకి, కేసీయార్ బోల్డంత పొలిటికల్ మైలేజ్ ఇవ్వాలనుకున్నారు, ఇస్తున్నారు.
ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్.. అనగానే, బండి సంజయ్ పొలిటికల్ మైలేజ్, బీజేపీ పొలిటికల్ మైలేజ్ మరింత పెరిగింది. కేసీయార్ ఈ మైలేజ్ ఎందుకు బీజేపీకి ఇస్తున్నట్లు.? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది కదూ.!
