తెలంగాణ రాజకీయమ్: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సమర్పణలో.!

బీజేపీ – కాంగ్రెష్ చేతులు కలిపాయంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. కాదు, బీజేపీ – టీఆర్ఎస్ చేతులు కలిపాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కాదు కాదు, టీఆర్ఎస్ – కాంగ్రెస్ చేతులు కలిపాయని కొత్త వాదనను తెరపైకి తెస్తోంది భారతీయ జనతా పార్టీ.

ఇంతకీ, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఎవరు ఎవరితో చేతులు కలిపారు.? ఇది అర్థం కాక తెలంగాణ ప్రజానీకం కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. రాజకీయాల్లో విలువలెంత ఛండాలంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఆరోపణలే నిదర్శనం.

ముగ్గురు చెబుతున్నదీ నిజమే అయితే, మూడు పార్టీలూ కలిసి కట్టుగా ఒకరి మీద ఒకరు దుమ్మత్తిపోసుకుంటూ హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయన్నమాట. ముగ్గురూ కలిసి ఒకే మాట మీద నిలబడి రాజకీయం చేస్తున్నట్టుంది.

అసలు హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకొచ్చింది.? అవినీతి ఆరోపణలతో తన మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తొలగించడం, ఈ క్రమంలో ఈటెల పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడంతోనే ఈతతంగమంతా జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా, బీజేపీ వైపు మొగ్గు చూపారు ఈటెల రాజేందర్. తన రాజకీయ భవిష్యత్తు బావుండాలంటే ఖచ్చితంగా ఈటెల గెలిచి తీరాలి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో. అదే సమయంలో, ఈటెలను ఓడించి కసి తీర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది.

అటు బీజేపీకీ, ఇటు గులాబీ పార్టీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే, పైకి కనిపించే ఈక్వేషన్ వేరు.. తెరవెనుకాల నడుస్తున్న రాజకీయం వేరు. కనీ వినీ ఎరుగని స్థాయిలో మూడు పార్టీలూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లను ఆకర్షించేందుకు ఖర్చు చేస్తున్నాయి.

ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్.. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న వైనం చూసి హుజూరాబాద్ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారట. అవసరమా ఇదంతా.? ఈ ఖర్చేదో నియోజకవర్గ అభివృద్ధి కోసం పెడితే బావుంటుంది కదా.? అన్నది ప్రజాస్వామ్యవాదుల వాదన.