రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలంగాణ ప్రాంత నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడాయన. అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పడూ చంద్రబాబుకి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడేనని చెబుతుంటారు. అన్నట్టు, చంద్రబాబుకి కూడా కాంగ్రెస్ పార్టీతో ఒకప్పుడున్న శతృత్వం ఇప్పుడు లేదు. ఆ సంగతి పక్కన పెడితే, రేవంత్ రెడ్డి.. ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
గత కొద్ది కాలంగా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వం విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నానా యాగీ జరిగింది. చాలామంది రేవంత్ రెడ్డికి అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నించారు. అయితే, రేవంత్ రెడ్డి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ మీద రాజకీయ దాడి చేసే నాయకుడు ఇంకొకరు లేరన్నది నిర్వివాదాంశం.
టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందే, కేసీయార్ మీద రాజకీయ పోరాటం చేసేందుకోసమని రేవంత్ రెడ్డి గతంలో గట్టిగా చెప్పారు. ఇక, ఇప్పుడు.. రేవంత్ రెడ్డి ఆశించిన పదవి కాంగ్రెస్ పార్టీలో ఆయనకు దక్కింది. అంటే, ఇకపై కేసీయార్ మీద రేవంత్ రెడ్డి రాజకీయ దాడి తీవ్రస్థాయికి చేరబోతోందన్నమాట. అయితే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా చాలా ఎక్కువ. ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఇంకో శతృవు అవసరమే వుండదు.
రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్షుడిగా చాలా సవాళ్ళను సొంత పార్టీకి చెందిన నేతల నుంచే ఎదురుకావొచ్చు. పీసీసీ అధ్యక్ష పదవిపై ఆశపడి, భంగపడినవాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని వీడితే.. రేవంత్ రెడ్డి పరిస్థితేంటి.? ఏమో.. కాలమే అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతుంది. ఒక్కటి మాత్రం నిజం.. రేవంత్ రెడ్డి రాకతో, కాంగ్రెస్ పార్టీ కొంత హడావిడి చేసే అవకాశముంది తెలంగాణలో. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక, రేవంత్ రెడ్డి సమర్థతకు కొలమానంగా మారే అవకాశమూ లేకపోలేదు.