ప్రతిరోజూ ఉదయం లేవగానే మనం మొదటగా చేసే పని పళ్లను శుభ్రం చేసుకోవడం. కానీ ఆ పళ్లను శుభ్రంగా ఉంచే టూత్‌బ్రష్ అసలే ఎంత శుభ్రంగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ముఖ్యంగా బాత్రూమ్‌లో, అది కూడా టాయిలెట్ దగ్గర టూత్‌బ్రష్‌ను ఉంచుకుంటున్నవారైతే ఇంతవరకు మీరు చేసిన ఆ అలవాటు ఇప్పుడే మార్చుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టాయిలెట్‌ను ఫ్లష్ చేసిన క్షణం నుంచి మనకు కనిపించని ఓ ప్రమాదం గాలిలోకి కలుస్తుంది. చిన్న చిన్న నీటి బిందువుల్లా గాలిలో చెలరేగే ఈ సూక్ష్మ తుంపరల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇవే నేరుగా మీ టూత్‌బ్రష్ పై వాలిపోతాయి. ఆ తర్వాత మీరు అదే బ్రష్‌తో పళ్ళు తోముకుంటే.. ఆ క్రిములు నేరుగా మీ నోట్లోకి వెళ్లిపోతాయి.
ఈ ప్రభావం ఒక్కరోజులో కనిపించకపోయినా, రోజూ ఇలా జరుగుతుండటంతో టూత్‌బ్రష్‌పై సూక్ష్మజీవుల భారమెల్లగా పెరుగుతూనే ఉంటుంది. దీని ప్రభావంతో నోటి ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, కోలిఫాం బ్యాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత తీవ్రమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక టాయిలెట్‌ను ఫ్లష్ చేసే సమయంలో గాలిలోకి వ్యాపించే ఈ సూక్ష్మజీవాలే కేవలం టూత్‌బ్రష్‌కే కాదు.. పక్కనే ఉన్న టవళ్లు, రెజర్, క్రీమ్స్, చేతి తువ్వాళ్ల మీద కూడా చేరుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మనం ఎంత శుభ్రంగా ఉన్నామనుకుంటున్నామో.. అంతకంటే ఎక్కువగా మన పరిసరాల్లో క్రిములు దాగిపోతున్నాయన్న మాట.
ఈ ప్రమాదాన్ని నివారించాలంటే పెద్దగా ఖర్చులు అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న జాగ్రత్తలు చాలు. టాయిలెట్‌ను ఫ్లష్ చేసే ముందు తప్పకుండా మూత మూసివేయడం, టూత్‌బ్రష్‌ను టాయిలెట్‌కు వీలైనంత దూరంగా ఉంచడం, నిటారుగా నిలబెట్టి పూర్తిగా ఆరనివ్వడం వంటి అలవాట్లు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తడిగా ఉన్న బ్రష్‌పై క్రిములు ఎక్కువ కాలం జీవిస్తాయన్నది మరవకూడదు.
కొంతమంది టూత్‌బ్రష్‌ను శుభ్రం చేయడానికి శానిటైజర్లు, ప్రత్యేక ద్రావణాలు వాడుతున్నా… అసలు మౌలికరక్షణ మాత్రం టాయిలెట్‌కు దూరంగా ఉంచడమే అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్న విషయంగా కనిపించే ఈ అలవాటు మారితే, పెద్ద ఆరోగ్య ప్రమాదం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఇకపై మీ టూత్‌బ్రష్ ఎక్కడ ఉంది.. అన్నది మరోసారి చూసుకోండి. ఎందుకంటే మీ రోజు ఆరోగ్యంగా మొదలవ్వాలా.. లేక మెల్లగా వ్యాధుల పల్లకిలోకి అడుగుపెట్టాలా అన్నది ఆ చిన్న బ్రష్‌పైనే ఆధారపడి ఉంటుంది.
