బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు కరోనా విజృంభిస్తోంది. కేసులు పెరగడం, నటీనటులు వైరస్ బారినపడుతుండటంతో మరోసారి ఇండస్ట్రీ మూతబడింది. సినిమా హాళ్లు క్లోజ్ అయ్యాయి. షూటింగ్స్ ఆగిపోతున్నాయి. పెద్ద సినిమాల విడుదలలు వాయిదాపడుతున్నాయి. ఇదొక కష్టమైతే కథల కొరత వారిని వెంటాడుతోంది. ఇన్నాళ్లు రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్లను నమ్ముకున్న దర్శకులంతా ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. ఆడియన్స్ లార్జర్ థెన్ లైఫ్ కథలను కోరుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పక్కా మాస్ ఎంటర్టైనర్లను ఇష్టపడుతున్నారు.
దక్షిణాది దర్శకులేమో మాస్ మసాలా సినిమాలతో ఊపు ఊపేస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే హిందీ ఆడియన్స్ చెవి కోసుకుంటున్నారు. వాళ్ళవే కాదు దక్షిణాది నుండి ఏ యాక్షన్ సినిమా వచ్చినా విరగబడి చూస్తున్నారు.ఇలాంటి సినిమాలు కదా చేయాల్సింది అంటూ అక్కడి హీరోలకు, దర్శకులకు హితబోధ చేస్తున్నారు. ఇక హిందీ హీరోలైతే సౌత్ దర్శకుల మీద గురి పెడుతున్నారు. ఆల్రెడీ షారుక్ ఖాన్ అట్లీతో సినిమా చేస్తున్నారు. త్వరలోనే అది మొదలుకానుంది. ఇక మరొక స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం తెలుగు స్టార్ డైరెక్టర్ ఒకరు కథ రాసుకుంటున్నారట. మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో, ఆ కథ ఎలా ఉంటుందో చూడాలి మరి.