తెలుగు సినిమా ఎల్లలుదాటి సత్తా చాటుతోంది. వ్యాపార మార్కెట్‌ను వెతుక్కుంటూ విదేశాల్లోకి అడుగుపెట్టిన తెలుగు సినిమా.. వసూళ్లలో జాతీయ సినిమాలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే -తెలుగు సినిమా గొప్ప ఓవర్సీస్‌లో మార్మోగుతోంది. తెలుగు సినిమా హీరోయిజం ప్రమాణాలు అక్కడి లెక్కలకు అనుగుణంగా మారుతోంది. తెలుగు వాళ్లు స్థిరపడిన చోటుకెళ్లి అక్కడి థియేటర్లలో వినోదాన్ని వెదజల్లుతూ కాసులు రాబడుతోంది.
ఒకప్పుడు విదేశాల్లో సినిమా విడుదల కావడమే గొప్ప. కానీ, వ్యాపారం సులువు తెలుసుకున్న మేకర్స్ ఓవర్సీస్‌ను దృష్టిలో పెట్టుకునీ సినిమాలు నిర్మిస్తున్నారు. అక్కడ భారీ పోటీ మధ్య సినిమాలు విడుదల చేస్తున్నారు. వసూళ్లు రాబట్టే పద్ధతిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఓవర్సీస్ మార్కెట్‌లో హిందీ సినిమాదే హవా. భారీ బడ్జెట్‌తో నిర్మించే హిందీ సినిమాలు చాలాకాలంగా భారీ వసూళ్లు అందుకుంటున్నాయ. మేమేం తక్కువ తిన్నామా? అన్నట్టు ఇప్పుడు తెలుగు సినిమాలు సైతం బాలీవుడ్‌తో పోటీపడి మరీ ఓవర్సీస్ వసూళ్లు అందుకుంటుండటం మారుతున్న పరిణామం.
ఆడియన్స్ కోరుకుంటున్న వైవిధ్యం వెనుక టాలీవుడ్ పరుగులు తీస్తోంది. భిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలకు ఆడియన్స్ సక్సెస్ రేటింగ్ ఇస్తున్నారు. సినిమా ఎలా వున్నా, ఫైనల్‌గా సాధించిన వసూళ్లను బట్టే సక్సెస్ రేట్‌ని లెక్కించడం మామూలే. ఎవరెలాంటి సినిమా తీశారన్నది కాదు -హిట్టయ్యిందా లేదా? వసూళ్లు భారీగా ఉన్నాయా లేదా? నిర్మాతకు ఎంత మిగిలింది? ఈ ప్రశ్నలకు రెస్పాన్స్ ఫైనల్ రిజల్ట్.
ఇక తెలుగు సినిమా స్థాయిని ‘బాహుబలి’ ఎక్కడికో తీసుకెళ్లింది. బాహుబలి సినిమా తరువాత అన్ని భాషల సినిమావాళ్లూ తెలుగు పరిశ్రమవైపు చూడటం ఎక్కువైంది. ఇక సినిమా వసూళ్ల విషయంలో -ఒకప్పుడు నైజాం ఏరియా అంటే హాట్ కేక్. నైజాం ఏరియా వసూళ్ల కోసం గట్టి పోటీ ఉండేది. కొందరు హీరోలు రెమ్యూనరేషన్ బదులు నైజాం హక్కులు తీసుకోవడమూ జరిగేది.
ఇపుడు పరిధి విస్తృతమైంది. భారతీయ చిత్రాలకు అక్కడ సెటిలర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో, తెలుగు సినిమా కూడా ఆయా దేశాల్లో విడుదలవుతోంది. దానికంటూ ఓవర్‌సీస్ మార్కెట్‌ని క్రియేట్ చేశారు. విదేశాల్లో సినిమా విడుదల కావడమే పెద్దగొప్పగా భావించే మేకర్స్.. అక్కడ భారీ పోటీ మధ్య సినిమాలు విడుదల చేయడం, వసూళ్లపరంగా ఎక్కువ రాబట్టుకునే దిశగా ప్రమోషన్ చేయడం తాజా పరిణామం.
ఇక ఓవర్‌సీస్ మార్కెట్‌లో హిందీ సినిమాదే హవా. భారీ బడ్జెట్‌తో విడుదలైన హిందీ సినిమాలు ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లు అందుకుంటూ దూసుకుపోతున్నాయి. మేమేం తక్కువ తిన్నామా? అన్నట్టు తెలుగు సినిమాలు సైతం బాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ ఓవర్సీస్ వసూళ్లు అందుకుంటున్నాయి.
ముఖ్యంగా అమెరికాలో తెలుగు చిత్రాలకు మంచి ఆదరణ కనిపిస్తోంది. కొంచెం బాగుంటే చాలు కలెక్షన్లు మిలియన్లు దాటుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాలనే కాకుండా, యువ హీరోల సినిమాలకూ థియేటర్లు నిండుతున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక వసూళ్లు (డాలర్లలో) సాధించిన తొలి పది చిత్రాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
ఓవర్సీస్ మొదటిస్థానంలో నిలిచింది బాహుబలి 2. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నాత్మక ప్రమోషన్‌తో రెండో భాగంపై క్రేజ్ పెంచాడు దర్శక ధీరుడు రాజవౌళి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో తెరకెక్కించిన బాహుబలి చిత్రం టాలీవుడ్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం. తెలుగు సినిమాను ఇంత బడ్జెట్‌తో నిర్మించి, అందుకు తగ్గ వసూళ్లు ఎలా సాధించుకోవచ్చో నిజానికి దర్శకధీరుడు రాజవౌళి ఓ కొత్త పాఠం నేర్పించినట్టే.
బాహుబలి మొదటి భాగం 6.9 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే, రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్ మాత్రం ఏకంగా 20 మిలియన్ డాలర్లని వసూలు చేసి టాలీవుడ్ రేంజ్‌లోనే టాప్ 1 అండ్ టాప్ 2 స్థానాల్లో నిలిచాయి. దాదాపు ఐదేళ్లపాటు రాజవౌళి తెరకెక్కించిన సినిమాను బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ పేరిట విడుదల చేశారు.
ఇక ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచింది రంగస్థలం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రివెంజ్ డ్రామా 1980 నేపథ్యంతో తెరకెక్కింది. రంగస్థలం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఒక్క ఓవర్‌సీస్ వద్దే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఇక ఓవర్సీస్‌లో 3.5 మిలియన్ల డాలర్లు వసూలు చేసి రామ్‌చరణ్ సత్తా ఏమిటో చూపింది.
ఇక నాలుగో స్థానంలో నిలిచింది సూపర్‌స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను. శ్రీమంతుడులాంటి సంచలన విజయం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన చిత్రమిది. మహేష్ సినిమాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులకు మంచి క్రేజ్. అతని సినిమాలన్నీ ఓవర్సీస్‌లో భారీ విజయాలే అందుకుంటున్నాయి. భరత్ అనే నేను సినిమా ఓవర్‌సీస్ వద్ద 3.4 మిలియన్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఐదో స్థానమూ మహేష్‌దే (శ్రీమంతుడు) కావడం గమనార్హం. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటు తెలుగులో కూడా సంచలన విజయం అందుకుంది. ఇక ఓవర్సీస్‌లో 2.8 మిలియన్లు వసూలు చేసి 5వ స్థానంలో నిలిచింది. గ్రామాలను దత్తత తీసుకోవాలన్న కాన్సెప్టుతో వచ్చిన శ్రీమంతుడు -ప్రేక్షకుల నుంచి మంచి విజయం అందుకుంది.
ఆరోస్థానంలో సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ నిలిచింది. ఏ జనరేషన్ ఆడియన్స్‌కైనా సావిత్రి జీవితం ఓ ప్రత్యేకాంశమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్‌పై వచ్చిన మహానటి తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఔరా! అనిపించింది. ఓవర్సీస్ మార్కెట్‌పై పెద్ద హీరోలకే దక్కని వసూళ్లను మహానటి రాబట్టడం విశేషం.
సెవెన్త్ ప్లేస్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దిన అఆ నిలిచింది. నితిన్, సమంత జోడీగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెలుగుతోపాటూ ఓవర్సీస్‌లోనూ తనదైన సత్తాచాటింది. ఓవర్సీస్‌లో 2.4 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం తెలుగులో సూపర్‌హిట్ అందుకోవడంతోపాటు టాలీవుడ్ బాక్సాఫీస్‌పై పెద్ద దుమారమే రేపింది. వేగంగా వందకోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలవడమే కాదు, మెగాస్టార్ స్టామినా ఇంకా తగ్గలేదని రుజువుచేసిన చిత్రమిది. వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన సినిమా ఓవర్సీస్‌లో 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సంచలన స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్‌లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచేసి టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద 100 కోట్ల మార్కెట్‌ని క్రాస్ చేస్తే, ఓవర్సీస్‌లో ఏకంగా 2.1 మిలియన్ల డాలర్లు వసూలు చేసి తొమ్మిదోస్థానంలో నిలిచింది.
టాప్ 10లో నిలిచే చిత్రం ఫిదా. ఓవర్సీస్‌లో 1.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కెరీర్ ప్రారంభంనుంచి భిన్నమైన సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న మెగా హీరో వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ తెలుగులోనూ పెద్ద హిట్టు. తాజాగా వచ్చిన కేజిఎఫ్ చాఫ్టర్ -2 , సాధించిన వసూళ్లు మామూలుగా లేవు. అలాగే తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిఎంతటి దుమారం లేపిందో తెలియంది కాదు. ఇక ముందు వచ్చే పాన్ ఇండియా సినిమాలు ఎలాంటి సత్తా చూపుతాయో చూడాల్సిందే!