అందరినీ ఇంప్రెస్ చేస్తున్న జగన్ మాటలు 

YS Jagan ready for a fight with High court
YS Jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రభుత్వం నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యాలను వివరించారు.  నిన్న ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం రాష్ట్ర అభివృద్దికి తమ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వివరించారు.  రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకుంటేనే ప్రజలకు రక్షణ, సమాజానికి అభివృద్ది అందుతాయన్న ఆయన ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను సమానంగా అందిస్తామని, అవకాశాల్లో, హోదాల్లో ప్రజలందరి మధ్య సమానత్వం పెంపొందిస్తామని రాజ్యాంగంలో రాసుకున్నాం అందుకే రైతులకు, మహిళలకు అండగా నిలుస్తున్నామని అన్నారు. 
 
అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటే అభివృద్ది వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని, అందుకే మూడు రాజధానుల విధానాన్ని తీసుకొచ్చామన్న సీఎం త్వరలోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  క్యాబినెట్లో సామాజిక న్యాయానికి కట్టుబడి దాదాపుగా 60 శాతం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కేటాయించాం.  ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.  రాజ్యాంగ స్పూర్తిని పాటించడం కోసమే అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత లాంటి పథకాలను అమలుచేస్తున్నామని అన్నారు. 
 
ఇక ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతూ అంటరానితనం రూపు మార్చుకున్నదని, అందుకే పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా కొందరు అడ్డుపడుతున్నారని మండిపడిన సీఎం ప్రత్యేక హోదా గురించి కూడా ప్రస్తావించారు.  పార్లమెంట్లో ఇచ్చిన మాట మేరకు కేంద్రం ప్రత్యేక హోదాను అమలుచేసి తీరాలని అవకాశం వచ్చినప్పుడల్లా హోదాను అడుగుతూనే ఉంటామని ఎప్పటికైనా హోదా సాధిస్తామని అన్నారు.  మామూలుగా పొలిటీషియన్స్ ప్రధాన సందర్భాల్లో ప్రసంగాలు చేసేప్పుడు ప్రత్యర్థుల మీద దాడి చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు.  కానీ నిన్న జగన్ విమర్శలకు తక్కువ సమయం ఇచ్చి ఎక్కువగా తమ విధానాలను గురించి, రాజ్యాంగ స్పూర్తి గురించి మాట్లాడి అందరినీ ఇంప్రెస్ చేశారు.