ఇదేదో అధికార వైసీపీ చేస్తున్న విమర్శ కాదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ కూడా కాదు. ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శ కూడా కాదు. సాధారణ ప్రజానీకం, తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రపదేశ్ విషయంలో ప్రతిసారీ ‘నో’ చెబుతున్న బీజేపీకి, తిరుపతి ఉప ఎన్నికల్లో ‘నో వోట్’ అని.. తిరుపతి ఓటర్లు బల్లగుద్దేస్తున్న దరిమిలా, బీజేపీ పోటీ నోటాతోనేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, బీజేపీ మాత్రం ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర.. అని వాపోతోంది.
ఎక్కడికి వెళ్ళినా తమ పార్టీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనీ, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారనీ కమలనాథులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమ, వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, రాజధాని, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇలా మొత్తం లిస్ట్ పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, బీజేపీని నిలదీస్తున్నా, అదంతా ‘తూచ్’ అని బీజేపీ నేతలు చెబుతుండడం గమనార్హం. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలానే వ్యవహరించింది. సొంతంగా పోటీ చేసేసి, సత్తా చాటుతామని ప్రకటించుకుంది. కానీ, ఏం జరిగింది.? ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కలేదు.. ఎంపీ సీటు సంగతి సరే సరి. దారుణంగా తిప్పి కొట్టారు బీజేపీని ఏపీలో 2019 ఎన్నికల సందర్బంలో ఓటర్లు.
ప్రస్తుతం జనసేనతో బీజేపీకి పొత్తు వున్నా, ఆ జనసేన కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన స్థాయిలో మద్దతు ఇవ్వడంలేదు. కాగా, మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను బీజేపీ, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించబోతోంది. కానీ, ఆమె వల్ల బీజేపీకి అదనంగా వచ్చే ఓటు ఏమీ వుండదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలోనో, ఇంకో విషయంలోనో బీజేపీ అధిష్టానం నుంచి రాష్ట్రానికి సానుకూల స్పష్టత వస్తే తప్ప, ఆయా విషయాల్లో రాష్ట్రానికి కేంద్రం వల్ల మేలు జరిగితే తప్ప, రాష్ట్రం నుంచి బీజేపీ ఓట్లనూ, సీట్లను ఆశించడం దండగమారి వ్యవహారం.