తిరుపతి బరిలో దిగడానికి భయపడుతున్న విపక్షాలు

tirupati-bypoll-oppositions-are-afraid-to-contest-in-tirupati-elections

tirupati-bypoll-oppositions-are-afraid-to-contest-in-tirupati-elections

మొన్నటిదాకా తిరుపతి ఉప ఎన్నికలో విజయం మాదంటే మాదని ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాయి. తిరుపతి కార్పొరేషన్లో ఒక్కటి మినహా అన్ని స్థానాలను వైసిపి గెల్చుకోవడమే కాక, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ శాసనసభా స్థానాల్లో కూడా అన్ని మున్సిపాలిటీలను అత్యధిక మెజారిటీతో గెల్చుకోవడంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా షాక్ కు లోనయ్యాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో తమ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారని, కాబట్టి తమకే సీటుని కేటాయించాలని డిమాండ్ చేసి ఆ తరువాత “సంప్రదింపులు” అయ్యాక జనసేన వెనక్కు తగ్గి బీజేపీకి జై కొట్టింది. అయినప్పటికీ స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా జీర్ణించుకోలేకపోయారు. వారు బీజేపీకి వ్యతిరేకంగా పనిచెయ్యడానికే మొగ్గు చూపుతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఏనాడో ప్రకటించింది. అయినప్పటికీ ఆమె పోటీ పట్ల ఉత్సాహాన్ని చూపించలేదు. తెలుగుదేశం నాయకులు బతిమాలి ఆమెను ఒప్పించారు. ఆ తరువాత ఆమె తిరుపతి ఒక్కసారి వెళ్లినట్లున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల ఫలితాల తరువాత పనబాక లక్ష్మి పూర్తిగా బేజారెత్తిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కదని ఆమె భావిస్తున్నారు. ఈమాత్రం దానికి రంగంలోకి దిగి డబ్బు, పరువు పోగొట్టుకోవడం అవసరమా అని లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. పోనీ, చంద్రబాబు పార్టీ తరపున డబ్బు సర్దుబాటు చేస్తారేమో అని ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఈ సమయానికి ఆయన రాష్ట్ర సిఐడి నోటీసులు అందుకుని విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన కూడా అచేతనుడై పోయాడు. మామూలు రాజకీయ ప్రకటనలు చెయ్యడానికి కూడా సాహసించడం లేదు. అలాగే నెల్లూరుకు చెందిన తెలుగుదేశం మహారాజపోషకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ కూడా పీకలలోతు కష్టాల్లో మునిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఆయన పక్కనే ఉన్న తిరుపతి ఉపఎన్నికలో ఏమాత్రం సాయం చేసే పరిస్థితి లేదు.

రాష్ట్రం మొత్తం మీద మూడు శాతం ఓట్లు కూడా సాధించలేక పూర్తిగా చతికిలపడిపోయిన బీజేపీ సంపూర్ణంగా చచ్చుపడిపోయింది. సోము వీర్రాజు నాయకత్వం ఆ పార్టీకి ఏమాత్రం ప్లస్ కాలేకపోగా పార్టీ పరిస్థితి మరీ దిగజారిపోయింది. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సమయోచిత నిర్ణయాలు, సమర్ధవంతమైన పరిపాలనతో బీజేపీ మతపరమైన ఆటలు సాగలేదు. బీజేపీ తోకను పట్టుకున్న జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సాధించింది కేవలం పదిహేడు వార్డులు! ఇక తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీ పోటీ చేసినా నోటా కన్నా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం లేదు.

వైసిపి పక్షాన చూస్తే ఒక సాధారణ మధ్యతరగతికి చెందిన ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చెయ్యడం ద్వారా ముఖ్యమంత్రి అతిపెద్ద సాహసాన్ని ప్రదర్శించారు. గురుమూర్తి గతంలో ఎన్నడూ రాజకీయాల్లో లేరు. రాజకీయ వర్గాల్లో ఆయన పరిచితుడు కారు. జగన్ స్వయంగా ప్రతిపాదించడమే ఆయనకున్న అర్హత. ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు. మచ్చలు లేవు. కాబట్టి ఆయనను ఏవిధంగా వంక పెట్టే వీలు లేదు. యువకుడు, విద్యాధికుడు కావడం ఆయనకున్న ప్లస్ పాయింట్స్. జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఆయనను గెలిపిస్తే భారీ ఎత్తున తిరుపతి నియోజకవర్గానికి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నది. ఆయన్ను గెలిపించే భారం అంతా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంటుంది కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద బండి నడకే.

మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే మాధ్యందిన మార్తాండుడు ముందు ప్రతిపక్షాలు అగ్గిపుల్లల్లా తేలిపోయేయి అని స్పష్టం అవుతోంది.

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు