తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తోంది.. పోలింగ్ దగ్గరపడింది. మైకులు మూతబడిపోతాయ్.. రాత్రి వేళ చీకటి మాటున డబ్బుల పంపకాలు షురూ అవుతాయి. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇప్పటికే ఓటుకు ఎంత పంచాలన్నదానిపై ఓ అవగాహనకు వచ్చేశాయి. ఏయే ప్రాంతాల్లో డబ్బుల పంచాల్సిన అవసరం వుందో కూడా, ఆయా పార్టీలకు చెందిన కొన్ని ప్రత్యేక టీములు ఓ అవగాహనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతానికి భిన్నంగా ఈసారి కులాల వారీగా, మతాల వారీగా కూడా డబ్బుల పంపిణీ ప్రత్యేకంగా జరగనుందంటూ తిరుపతి లోక్ సభ పరిధిలో గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం, బలవంతపు మత మార్పిడులు వంటి అంశాలు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చర్చకు వచ్చాయి. చిత్రంగా ప్రత్యేక హోదా గురించిన డిమాండ్లు ఏవీ గట్టిగా రాలేదు. ఆ లెక్కన భారతీయ జనతా పార్టీకి ఈ పరిణామం కాస్త ఉపశమనమే. టీడీపీ, వైసీపీలను ఈ విషయంలో బాగానే బీజేపీ మేనేజ్ చేయగలిగిందన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళలేదు.
బీజేపీ నుంచి ప్రధాని, కేంద్ర హోంమంత్రి ప్రచారానికి వస్తారంటూ పెద్దయెత్తున హంగామా నడిచినా.. అవేవీ జరగలేదు. కానీ, బీజేపీ గ్రామ స్థాయిలోనూ బాగానే ప్రచారం చేసింది. జనసేన కూడా బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త బాగానే కష్టపడింది. ఇక, ప్రధానంగా పోటీ వైసీపీ – బీజేపీ మధ్యనే. చంద్రబాబు, లోకేష్.. చాలా చాలా శ్రద్ధతో ప్రచారం చేశారు.. పార్టీ గెలుపు ఖాయమంటూ నినదించారు. అంతిమంగా ఓటరు మదిలో ఏముందన్నది ఫలితాలు వెల్లడయ్యాకే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే, ఎవరెంతలా ప్రచారం చేసినా అడ్వాంటేజ్ మాత్రం వైసీపీకే వుండబోతోంది. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో, సహజంగానే వైసీపీకి ఆ అనుకూలత వుంటుంది.