నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఖర్చుని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, అధికారికంగానే అభ్యర్థికి అందజేసింది. 28 లక్షల రూపాయల చెక్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి అభ్యర్థి నాయని భగత్‌కి అందింది. ఓ అసెంబ్లీ నియోజకవర్గానికే ఇంత ఖర్చు.. అదీ అధికారికంగా ఓ అభ్యర్థి తరఫున జరిగితే, లోక్‌సభ నియోజకవర్గానికి ఇంకెంత ఖర్చు జరగాలట.? నిజానికి ఇది ఎన్నికల కమిషన్ ఆమోదించిన ఖర్చే. కానీ, అంతకు మించి.. కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు ఎన్నికల్లో జరుగుతోంది చాలాకాలంగా. టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత (కీలక పదవిలో పనిచేశారు.. అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు..) ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను గెలవడానికి 11 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఖర్చు అది. రాజకీయాలు ఎలా తయారయ్యాయో చెప్పడానికి ఇంకతన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? తిరుపతి ఉప ఎన్నిక కోసం అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఆయా అభ్యర్థుల ఆస్తుల లెక్కలు అపిడవిట్ల రూపంలో బయటకు వస్తున్నాయి. వైసీపీ అభ్యర్థికి కారు లేదు.. కాంగ్రెస్ అభ్యర్థికి ఆస్తుల్లేవు. బీజేపీ అభ్యర్థి మాత్రం రిచ్.. టీడీపీ అభ్యర్థి కూడా ఫర్వాలేదు. అయితే, అఫిడవిట్లలో అభ్యర్థులు చూపించే లెక్కలకీ, ఆయా ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుకీ పొంతన వుండదు. లిక్కర్ డంప్‌లు వుంటాయి.. నోట్ల కట్టలు కరిగిపోతుంటాయ్.. ఇవన్నీ ఎన్నికల్లో మామూలే. ఓ అంచనా ప్రకారం, ఆంద్రపదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా తిరుపతి ఉప ఎన్నిక మారబోతోందట. గతంలో గుంటూరు జిల్లాలోని ఓ లోక్ సభ నియోజకవర్గం, కృష్ణా అలాగే విశాఖపట్నం జిల్లాల్లోని రెండు లోక్ సభ నియోజకవర్గాలూ అత్యంత ఖరీదైనవిగా ఎన్నికల ఖర్చు లెక్కల పరంగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. వాటికి మించి ఖర్చు ఇప్పుడు జరగబోతోందట.. అదీ మూడేళ్ళ పదవీ కాలం కోసం ఇంత ఖర్చు అంటే ఆషామాషీ వ్యవహారం కాదిది.