తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ – జనసేన కూటమి పోటీ పడేది ‘నోటా’తో మాత్రమేనని అధికార వైసీపీ బలంగా నమ్ముతోంది. తమకు కాస్తో కూస్తో పోటీ ఇస్తే అది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీయేననీ, ఆ పార్టీ కూడా డిపాజిట్లు తెచ్చుకోవడం ఈసారి అంత తేలిక కాదని వైసీపీ నేతలు కుండబద్దలుగొట్టి చెబుతున్నారు. అయితే, ‘అలసత్వం అస్సలు వద్దు.. గట్టి మెజార్టీ సాధించాలి.. దాంతో గట్టి సంకేతాల్ని పంపాలి..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తిరుపతి ఉప ఎన్నిక విషయమై పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. మరోపక్క, ‘యేసుబాబు’ అంటూ వైసీపీ మీద విమర్శల దాడి మొదలు పెట్టిన బీజేపీ, సోషల్ మీడియా వేదికగా కేంద్ర పథకాల వాటా లెక్కలు తీస్తోంది. ‘రైతు భరోసా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పబ్లసిటీ స్టంట్లు చేస్తోందనీ, 13,500 ఇస్తామని చెప్పి అందులో 6 వేల రూపాయలు కేంద్రమే ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 7,500తో సరిపెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ రైతు భరోసా విషయమై గతంలోనే వైసీపీ సర్కార్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది, ఎదుర్కొంటూనే వుంది. రాష్ట్రాలు చేపట్టే అనేక కార్యక్రమాల్లో కేంద్రం వాటా ఖచ్చితంగా వుంటుంది. కేంద్రం వివిధ రూపాయల్లో విధించే పన్నులు రాష్ట్రాల నుంచే కదా వసూలవుతాయి.? మళ్ళీ రాష్ట్రాలకు వేరే పన్నులుంటాయి. కేంద్రం, తాము వసూలు చేసిన పన్నుల నుంచి కొంత వాటానికి రాష్ట్రాలకు పంపడం మామూలే.. అదీ వివిధ పథకాల కింద. ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ, దీన్ని హైలైట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడంలేదన్న బలమైన అభిప్రాయాన్ని జనం మీద రుద్దేందుకు ఏపీ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రచారం కింది స్థాయిలో అధికార వైసీపీని దారుణంగా దెబ్బ తీసే ప్రమాదం లేకపోలేదు. ఇంతరకు వైసీపీ నుంచి బీజేపీకి ధీటైన సమాధానం ఏ విషయంలోనూ వెళ్ళని దరిమిలా, తిరుపతి ఉప ఎన్నిక వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. బీజేపీ స్పీడుకి వైసీపీ బ్రేకులేయలేకపోతే.. ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు.