ప్రజలకు సేవ చేస్తున్నారా.? అప్పుల్లో ముంచేస్తున్నారా.?

చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులకు బాధ్యత ఎవరిది.? ఆ అప్పుల భారం రాష్ట్ర ప్రజల మీద మోపబడింది తప్ప, చంద్రబాబు మీదనో, తెలుగుదేశం పార్టీ మీదనో కాదు కదా.? చంద్రన్న ‘కానుక’లు అన్నాక, ఖర్చు భరించాల్సింది చంద్రబాబే మరి.!

అప్పట్లో చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తేడా ఏముంది.? ఏ రాయి అయితేనేం, పళ్ళూడగొట్టుకోవడానికన్నట్టు తయారైంది పరిస్థితి. జగనన్న పేరుతో సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నాయి. వాటి కోసం వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు.

కొన్నాళ్ళ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయి, మరో ప్రభుత్వం రావొచ్చు. కానీ, అప్పుల భారం మోయాల్సింది మళ్ళీ ప్రజలే. ఇప్పుడు జరుగుతున్న అప్పులకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావొచ్చు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావొచ్చు బాధ్యత వహించదు.

మరి, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నామని అప్పుటు చంద్రబాబు ప్రభుత్వం చెప్పినా, ఇప్పుటు వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్పినా, దాంట్లో అర్థమేముంది.? ప్రజల సొమ్ముని ప్రజలకు పంచి పెట్టడం కాదు, అప్పులు చేసి.. తద్వారా ప్రజల నెత్తిన బండ మోపి, ఆ ఘన కార్యానికి తమ పేర్లు పెట్టుకుంటున్నారు. అదీ తేడా.

మూడేళ్ళు గొప్పగా సేవ చేసేశాం.. మరో రెండేళ్ళు ఇంకా గొప్పగా సేవ చేసేస్తాం.. ఆ తర్వాత మళ్ళీ తమకే అధికారమివ్వండంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ మూడేళ్ళ పాలన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంపారు. అంటే, ఇంకో రెండేళ్ళు మరింతగా అప్పుల భారం, పన్నుల భారం మోపుతాం.. మా పేర్లు పెట్టకుంటాం.. మీరైతే మమ్మల్ని ఆశీర్వదించండి.. అని అడుగుతున్నారన్నమాట.