త్రీ ప్లస్ వన్.. నాలుగు కావాలంటోన్న టీడీపీ.!

TDP About Tirupati Bypoll

TDP About Tirupati Bypoll

పంచాయితీ ఎన్నికల్లో చేతులెత్తేసి, మునిసిపల్ ఎన్నికల్లో నిండా మునిగిపోయి.. పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో మాత్రం తామే గెలుస్తామంటోంది. ‘మేం ప్రస్తుతానికి ముగ్గురు లోక్‌సభ సభ్యులం వున్నాం. అయినా, రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. మరో ఎంపీ మాకు జత కలిస్తే.. మా బలం నాలుగుకి చేరుతుంది. సీనియర్ పొలిటీషియన్ పనబాక లక్ష్మి గెలిస్తే, మా పార్టీకీ.. మాకూ, తిరుపతికీ, రాష్ట్రానికీ మేలు జరుగుతుంది..’ అంటూ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. నిజానికి, తిరుపతిలో రెండో ప్లేస్ తాజా లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీదే. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే, టీడీపీ గెలిచేందుకూ అవకాశాల్లేకపోలేదు. కానీ, తిరుపతి సాక్షిగా తన పరువు పోగొట్టేసుకున్నారు గతంలోనే చంద్రబాబు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి విమానాశ్రయం సాక్షిగా హై డ్రామాకి తెరలేపి పార్టీని పూర్తిగా చంద్రబాబు నాశనం చేసేసిన వైనం అందరికీ గుర్తుండే వుంటుంది.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందాయె. తిరుపతి అభివృద్ధికి సంబంధించి తమ వద్ద వున్న ఆలోచనలేంటో ప్రజల ముందుంచాల్సిన టీడీపీ, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలిస్తే, పెన్షన్లను పెంచుతామంటోంది.. పెట్రోధరల్ని తగ్గిస్తామంటోంది. ఇదెక్కడి వింత.? రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీకి పెద్దగా ప్రాతినిథ్యం లేదు. పార్లమెంటులోనూ టీడీపీ ప్రాతినిథ్యం అంతంతమాత్రమే. ప్రస్తుతానికి ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారని టీడీపీ చెబుతోందిగానీ, మొన్నీమధ్యనే జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ ఎంపీ, టీడీపీ అధినాయకత్వం తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయనిప్పుడు పెద్దగా పొలిటికల్ తెరపై కనిపించడంలేదు. రేప్పొద్దున్న పనబాక లక్ష్మి గెలిచినా.. టీడీపీలో వుండడం కష్టమేనన్న ప్రచారం జరుగోతంది. ఇదీ టీడీపీ దుస్థితి.