Accident: ప్రతి రోజూ ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో ఆక్సిడెంట్లు జరుగుతూనే వున్నాయి.రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం అజాగ్రత్త వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాహనాన్ని నడిపే వారు నిద్రమత్తులో ఉండటం, లేదా అతి వేగంగా వాహనాన్ని నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటువంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే..తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామంలో జరిగిన స్నేహితుడి వివాహానికి వెళ్లి పెళ్లి వేడుక ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగంగా నడపడం వల్ల కారు అదుపు తప్పి జిల్లాలోనీ కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నాడు. మరణించిన వారు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక కి చెందిన అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.మరణించిన ముగ్గురు వ్యక్తులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కారు అతివేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.