ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మూడో విడత అమ్మ ఒడి నిధుల్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి పంపించే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ‘బటన్ నొక్కి’.. అంటూ దాదాపు ప్రతినెలా ఏదో ఒక సంక్షేమ పథకానికి సంబంధించి ఇలాగే సొమ్ముల్ని జనంల వద్దకు చేర్చుతోంది వైసీపీ సర్కారు.
నిజానికి, ఇది చాలా మంచి కార్యక్రమమే. నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి సంక్షేమం తాలూకు సొమ్ములు వెళితే, అవినీతికి ఆస్కారం వుడదు. కానీ, వైసీపీ సర్కారు చేస్తున్న ఈ ‘నగదు బదిలీ సంక్షేమం’ ఎంతవరకు రాజకీయంగా వైసీపీకి సత్ఫలితాలనిస్తుంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
డబ్బు ఎవరికి చేదు.? అన్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. 15 వేల రూపాయల చొప్పున అమ్మ ఒడి పథకం కింద ఇస్తామని వైసీపీ ప్రకటించింది. ఆ పదిహేను వేలూ వేస్తోంది కూడా. కానీ, అదులో 2 వేల రూపాయల్ని ‘నిర్వహణ’ కింద ప్రత్యేకంగా లాక్కుంటున్న పరిస్థితిని చూస్తున్నాం.
‘స్వచ్ఛందంగానే ఇస్తున్నారు..’ అని వైసీపీ చెప్పొచ్చుగాక. కానీ, జరుగుతున్నదేంటో అందరికీ తెలుసు. ఖాతాలో పడాల్సిన 15 వేలలో, 2 వేలు ఔట్ అవుతోంటే, ఆ బాధ ఎలా వుంటుంది.? అప్పనంగా వచ్చే సొమ్ములని అనుకునేంత అమాకులైతే జనం కాదు.
అలా తమ ఖాతాల్లో పడుతున్న డబ్బులు, ప్రభుత్వం అప్పు చేసి వేస్తున్నవనీ, వాటికి వడ్డీ సైతం తామే భవిష్యత్తులో చెల్లించాల్సి వస్తుందని జనం తెలుసుకోకుండా వుంటారా.? ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి తీసుకుంటారు. అందులో కోత పడుతున్నా, గట్టిగా మాట్లాడలేరు. కానీ, ఎన్నికల వేళ.. ఇవన్నీ అత్యంత ఖరీదైన తప్పిదాలుగా వైసీపీ తెలుసుకునే పరిస్థితి రావడమైతే ఖాయం.